- గోవాలో క్రిస్టియన్ల జనాభా 33 శాతం
- మొత్తం అసెంబ్లీ స్థానాలు 40
- క్రిస్టియన్లు గెలుపోటములను శాసించే స్థానాలు 15
సాగర తీరం.. పర్యటక రాష్ట్రమైన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో క్రిస్టియన్లు ఎంత కీలకమే చెప్పడానికి ఈ గణాంకాలు చాలు.
Goa assembly election 2022: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న.. మమతా బెనర్జీ, కేజ్రీవాల్.. మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్.. అధికారం నిలబెట్టుకోవాలని ఆశపడుతున్న భాజపా.. కింగ్‌మేకర్ కావాలని కుతూహలంగా ఉన్న ఎన్సీపీ-శివసేన కూటమి.. వెరసి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ.. గోవాలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
రాష్ట్రంలో బహుముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో.. 33శాతం జనాభాగా ఉన్న క్రైస్తవులు బలమైన శక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న క్రిస్టియన్లను ఏ పార్టీ ఆకర్షిస్తుందో.. ఆ పక్షం గేమ్- ఛేంజర్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో క్రిస్టియన్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.
ఇందుకోసం క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న స్థానాల్లో.. ఆ వర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దింపుతున్నాయి. మ్యాజిక్ నంబర్‌ను చేరుకోవాలన్నా.. కింగ్‌మేకర్ కావాలన్నా.. ఈ 15సీట్లను రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.
నియోజకవర్గంలో ఓటర్లు ఎక్కువగా ఉన్న సామాజికవర్గం అభ్యర్థికే టికెట్ ఇచ్చే విధానం ఎప్పటి నుంచో గోవాలో ఉంది. క్రైస్తవుల ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ వర్గానికి రాజకీయ ప్రాముఖ్యం ఏర్పడింది. అందుకే అన్ని పార్టీలు 33 శాతం మంది ఉన్న క్రైస్తవులను తమవైపు తిప్పుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను నిలబెట్టాయని సీనియర్ జర్నలిస్టు కిషోర్ నాయక్ గావ్కర్ అన్నారు.
"గోవా చాలా చిన్న రాష్ట్రం. చర్చిలకు కూడా ప్రసిద్ది చెందింది. క్రిస్టియన్ కమ్యూనిటీ 33 శాతం ఉంటుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో క్రిస్టియన్ ఓటర్లను ఆకర్షించేందుకు.. ఆ వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నించారు. భాజపా కూడా క్రైస్తవ అభ్యర్థులకు తగిన ప్రాతినిధ్యం కల్పించింది"
-కిషోర్ నాయక్ గావ్కర్, సీనియర్ జర్నలిస్టు
గోవాలోని తాలెగావ్, కుంకోలి, నవేలి, నువెమ్, కలంగుట్, ఆండ్రీ, వెలిమ్, అల్డోనా, దభోలీ, సెయింట్ క్రూజ్, కర్తోరి, సిలిమ్, కుర్చెడ్, బెంగాలీ, ఫతోర్డా నియోజకవర్గాల్లో క్రైస్తవ ఓటర్లు బలమైన శక్తిగా ఉన్నారు.
కాంగ్రెస్ అత్యధికంగా 17 మందికి..
గోవాలో క్రిస్టియన్ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలోని 40అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 17 చోట్ల క్రిస్టియన్ అభ్యర్థులను బరిలోకి దించుతోంది హస్తం పార్టీ. గోవాలో మొదటి నుంచి కాంగ్రెస్‌కు క్రిస్టియన్ల మద్దతు కొనసాగుతూ వస్తోంది. అందుకే ఈ స్థాయిలో సీట్లను కేటాయించినట్లు సమాచారం.