వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవాళికి పెను ముప్పుగా మారుతున్నాయి. ప్రపంచ నీటి చక్రాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. పెరుగుతోన్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గుతోందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పులు మానవుల నీటి, ఆహార భద్రతతో పాటు చుట్టూ ఉన్న వృక్ష, జంతుజాలానికి ముప్పు తెస్తున్నాయని, అలాగే మానవ జీవితాన్ని, పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రపంచంలోని 31 ప్రధాన నదుల పరివాహక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావాన్ని పరిశీలించారు. గ్రావిటీ రికవరీ అండ్ క్లైమేట్ ఎక్స్పెరిమెంట్(గ్రేస్)ఉపగ్రహ పరిశీలనల ఆధారంగా ఆయా నదుల్లోని నీటి లభ్యతను అంచనా వేశారు. వీటిలో అమెజాన్, గంగా, బ్రహ్మపుత్ర, సింధు, నైలు, టెగ్రిస్-యూఫ్రటీస్, మెకాంగ్, మిస్సిస్సిప్పి వంటి ప్రధాన నదులు ఉన్నాయి. ఈ నదుల పరివాహంలోనే ఎక్కువ జనాభా నివసిస్తున్నారు.