దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులను ఛిన్నాభిన్నం చేయడానికి ఖలిస్థాన్ కమాండో ఫోర్స్(కేసీఎఫ్) కుట్ర పన్నిందని కేంద్ర నిఘా సంస్థలు పసిగట్టాయి. ఓ రైతు నాయకుడిని హత్య చేసేందుకు ఈ ఉగ్ర సంస్థ ప్రణాళికలు రచించిందని నివేదికలో పేర్కొన్నాయి. దీనిపై అంతర్జాతీయ కుట్రే జరిగిందని తెలిపాయి.
బెల్జియం, యూకేకు చెందిన కుట్రదారులు.. దిల్లీలో నిరసనలు చేస్తున్న ఓ రైతు నాయకుడిని చంపాలని చూస్తున్నారని వెల్లడించాయి నిఘా సంస్థలు. పంజాబ్‌లో.. గతంలో కేసీఎఫ్కు చెందిన దుండగుల్ని అంతమొందించడంలో ఆ రైతు నాయకుడి పాత్ర ఉందన్న కారణంతోనే అతడిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి:'టూల్‌కిట్'లో ఐఎస్ఐ, ఖలిస్థాన్ మద్దతుదారుడి హస్తం!
ఇదే సరైన తరుణం..
ఆ రైతు నేతను చంపేందుకు ఇదే సరైన తరుణమని భావించి ఉంటారని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. రైతు నాయకుడిని చంపితే భారత్‌లో హింస పెరిగిపోయి, ప్రభుత్వ సంస్థలు, రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరుగుతుందని కేసీఎఫ్ దురాలోచనకు పాల్పడినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
కేసీఎఫ్.. భారత్‌లో ఎన్నో దురాఘతాలకు పాల్పడింది. ఈ ఉగ్రవాద సంస్థలో కెనడా, యూకే, బెల్జియం, పాకిస్థాన్‌కు చెందినవారు ఉన్నారు.
ఈ రైతు నిరసనలను తమకు అనుకూలంగా మలుచుకొని.. ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థలు పుంజుకోవాలని చూస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం రోజు ఎర్ర కోట వద్ద జరిగిన హింసాత్మక అల్లర్లలో.. వీరి పాత్ర ఉన్నట్లు అనుమానాలు నెలకొన్నాయి. ఆ రోజు పలువురు ఖలిస్థానీ జెండాలు చేతబట్టి, వారి అనుకూల నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చూడండి: ఖలిస్థానీ జెండా ఎగురవేసిన ఆరుగురు అరెస్టు