పర్యటకులకు స్వర్గధామం జమ్ము కశ్మీర్. మంచు అందాలు పెనవేసుకొని ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షించే ప్రాంతమిది. కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల ఇటీవల ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరిని ఆకట్టుకునేందుకు స్థానిక హోటళ్లు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కోవలోనే ఓ హోటల్.. అద్దాలతో చేసిన ఇగ్లూలను ఏర్పాటు చేసింది.
గుల్మార్గ్లో ఉన్న కొలహోయి గ్రీన్ హైట్స్ అనే ప్రముఖ హోటల్.. ఈ వినూత్న అద్దాల ఇగ్లూలను నెలకొల్పింది. గతంలో మంచుతో ఇగ్లూలను నిర్మించి పర్యటకులను ఆకట్టుకున్న ఈ హోటల్.. తాజాగా అద్దాల లోపలి నుంచి మంచు అందాలు ఆస్వాదించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చైనా నుంచి దిగుమతి చేసుకొని అద్దాల ఇగ్లూలను నిర్మించినట్లు ఈ హోటల్ మేనేజర్ హమీద్ మసూది చెబుతున్నారు. ఫ్యాబ్రికేటెడ్ గ్లాస్‌తో ఇగ్లూ రెస్టారెంట్ ప్రారంభించడం భారత్‌లో ఇదే తొలిసారని చెబుతున్నారు.
"గతేడాది రెండుసార్లు మంచు ఇగ్లూలు తయారు చేశాం. గుల్మర్గ్లోనే కాదు, కశ్మీర్‌లోనే అది తొలి మంచు ఇగ్లూ. ఆసియాలోనే అతిపెద్ద ఇగ్లూలను రూపొందించాం. ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద మంచు ఇగ్లూలు నిర్మించాం. ఈ సారి కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామని అనుకున్నాం. ఫిన్లాండ్కు చెందిన కాన్సెప్ట్ ఇది. ఫిన్లాండ్లో అద్దాల ఇగ్లూలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. టూరిస్టులకు కొత్త అనుభూతిని పరిచయం చేయాలని అనుకున్నాం. మంచు కోసమే అందరూ ఇక్కడికి వస్తారు. ఈ అద్దాల ఇగ్లూలో కూర్చొని ఆహారం తింటూ హిమపాతాన్ని ఆస్వాదించవచ్చు. వారికి ఇదో కొత్త అనుభూతిలా ఉంటుంది. ఇగ్లూ లోపల హీటింగ్ అన్ని ఏర్పాట్లు చేశాం. అతిథులకు అసలు చలి అనిపించదు. బర్త్‌డేలు, వార్షికోత్సవాలు జరుపుకొనేందుకు చాలా మంది ఇక్కడికి వస్తారు. గరిష్ఠంగా ఇందులో ఎనిమిది మంది కూర్చోవచ్చు."
-హమీద్ మసూది, హోటల్ మేనేజర్