మానవులు విచ్చలవిడిగా విడుదల చేస్తున్న హానికారక వాయువులతో హిమ శైలం చిగురుటాకులా కంపిస్తోంది. వాటి నుంచి వెలువడే వేడికి నిలువెల్లా కరిగిపోతోంది. వేల కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన మంచు దుప్పటికి చిల్లులు పడుతున్నాయి. ఈ భారీ పర్వతరాజంపై కొలువు తీరిన హిమానీ నదాలు తరిగిపోతున్నాయి. ఇది జలవిలయానికి కారణమవుతోంది. తాజాగా ఉత్తరాఖండ్‌ను కుదిపేసిన విపత్తు కారణాల్లో భూతాపం అత్యంత ప్రధానమైనది.
ఏమిటీ పర్వత శ్రేణి?
అఫ్గానిస్థాన్ నుంచి మయన్మార్ వరకూ ఎనిమిది దేశాల్లో.. 3500 కిలోమీటర్ల మేర విస్తరించిన హిందుకుష్ హిమాలయాలు ఎవరెస్టు సహా ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతాలకు ఆలవాలంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మూడో ధ్రువంగా అభివర్ణిస్తారు. ధ్రువ ప్రాంతాలకు వెలుపల ప్రపంచంలోనే అత్యంత భారీగా మంచినీటి నిల్వలు హిమ రూపంలో ఇక్కడే ఉన్నాయి. దిగువ ప్రాంతాల్లోని కోట్ల మందికి ఇవి ప్రాణాధారం. ఇక్కడి హిమానీ నదాలు.. గంగా, మెకాంగ్, యాంగ్జీ, బ్రహ్మపుత్ర సహా ఆసియాలోని పది అతిపెద్ద నదులకు జలధారను అందిస్తున్నాయి. ఇక్కడ 30వేల చదరపు మైళ్లకుపైగా హిమానీనద మంచు నిక్షిప్తమై ఉంది.
హిమాలయాలు.. పర్యావరణపరంగా చాలా సున్నితమైనవి. వాతావరణ మార్పులు, మానవ చర్యలు, పెరుగుతున్న భూతాపం వల్ల అక్కడ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల ఫారెన్‌హైట్ మేర పెరిగాయని కాఠ్‌మాండూలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్‌మెంట్ (ఐసీఐఎంవోడీ) అధ్యయనంలో తేలింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే భూతాపం ప్రభావం ఇక్కడే ఎక్కువగా ఉంది. ఫలితంగా హిమానీనదాలు వేగంగా తరిగిపోతున్నాయి. మంచు కరుగుతోంది. వాతావరణ తీరుతెన్నులూ గందరగోళమయ్యాయి.
ఈ శీతాకాలంలో మంచు తగ్గడం వల్లే?
ఉత్తరాఖండ్‌లో ఈ శీతాకాలంలో హిమపాతం తగ్గింది. దాని వల్లే తాజాగా హిమానీనద చరియలు విరిగిపడి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఇది జరగడం అసాధారణమేనని చెప్పారు. శీతాకాలంలో వర్షం, హిమపాతం వల్ల హిమానీనదాలు పరిపుష్టమవుతాయి. ఈ ఏడాది ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో హిమపాతం తక్కువగా ఉండటం వల్ల హిమానీనదాలు నిర్మాణపరమైన లోపాలు సరికాలేదని పేర్కొన్నారు. అందువల్లే ఈ విపత్తు జరిగి ఉంటుందని చెప్పారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్‌లో దాదాపు 200కుపైగా ప్రధాన హిమానీ నదాలు ఉన్నాయి.
కరుగుతున్న హిమానీ నదాలు
వాతావరణ మార్పుల వల్ల మంచు, వర్షపు పోకడల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎత్తయిన పర్వతాల్లో హిమపాతంలో అధికశాతం.. రుతుపవనాలు తాకినప్పుడు సంభవిస్తుంటుంది. వాతావరణ మార్పుల వల్ల కొన్ని దశాబ్దాలుగా రుతుపవనాలు బలహీనమయ్యాయి. దీంతో హిమానీనదాలపై మంచు పేరుకుపోవడం తగ్గిపోతోంది.
- 2000 నుంచి హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు 20-47 శాతం మేర తగ్గిపోయాయి. పరిస్థితి ఇదేరీతిలో కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి 50 శాతం మేర హిమానీనదాలు తరిగిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇవీ కష్టాలు..
హిమానీనదాలు, మంచు ఫలకాలు నీటిని నిల్వ చేసే ట్యాంకుల్లాంటివి. దశాబ్దాలు, శతాబ్దాల కాలంలో సీజన్లవారీగా అవి మెల్లగా కరుగుతూ నీటిని నదుల్లోకి క్రమంగా వదులుతాయి. వాతావరణ మార్పులతో ఈ కరుగుదల వేగంగా సాగడం వల్ల సరస్సుల్లో, నదుల్లో నీరు ఎక్కువగా చేరుతోంది.
- మంచు అధికంగా కరగడం వల్ల హిమానీనదాలపై సరస్సులు ఎక్కువగా ఏర్పడతాయి. 1977 నుంచి నేపాల్ హిమాలయ ప్రాంతంలో గ్లేషియల్ సరస్సులు రెట్టింపు కావడం ఇందుకు నిదర్శనం.
- మంచు కరుగుదల విపరీతంగా ఉన్నప్పుడు ఈ సరస్సుల్లో నీటి మట్టం చాలా వేగంగా పెరిగిపోతుంటుంది. గట్టులా పనిచేసే పర్వతాకృతి వద్ద కూడా మంచు కరిగి, ఆ ప్రాంతం వదులుగా మారుతుంది. దీంతో ఆ గట్టులోని రాతిపెళ్లలను బద్దలుకొట్టుకుంటూ నీరు.. దిగువ ప్రాంతాలకు ఉరకలెత్తుతుంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో జరిగింది ఇదే. సరస్సులు పెరిగితే హిమానీనదంలోని మంచుచరియలు విరిగిపడే ఘటనలూ పెరుగుతాయి. నదుల్లో మట్టి, రాళ్ల పరిమాణమూ పెరుగుతుంది.
- భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన స్థాయిలో గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించినప్పటికీ 2030 నాటికి భారత హిమాలయాలు 2.6 డిగ్రీల సెల్సియస్ నుంచి 4.6 డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కుతాయి. 2100 నాటికి ఈ ప్రాంతంలోని సరాసరి ఉష్ణోగ్రత కూడా 5.2 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతుంది.