తెలంగాణ

telangana

ETV Bharat / bharat

12 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిన ఫోన్​ కాల్​ - Glacier burst

ఉత్తరాఖండ్​ వరదల్లో చిక్కుకుని ప్రాణాలపై ఆశలు వదులుకున్న 12మంది కార్మికులకు మొబైల్​ ఫోన్ సిగ్నల్​ ఆశా కిరణమైంది. ఒక్క ఫోన్​ కాల్​.. సొరంగంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటపడేసింది. దాదాపు 7 గంటల పాటు శ్రమించి ఐటీబీపీ సిబ్బంది వీరిని రక్షించింది. ఆ భయానక పరిస్థితిని కార్మికులు స్వయంగా వివరించారు.

Glacier burst: How a phone call saved their lives, recount survivors
12 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిన ఫోన్​ కాల్​

By

Published : Feb 8, 2021, 5:49 PM IST

ఇక బతికే అవకాశం లేదని జీవితం మీద ఆశలు వదులుకున్న వారికి మొబైల్​ ఫోన్లో నెట్​వర్క్​ సిగ్నల్​ చూసి ఆశలు చిగురించాయి. వెంటనే తాము సొరంగంలో చిక్కుకున్న విషయాన్ని పై అధికారికి తెలియజేశారు. ఆయన హుటాహుటిన అధికారులకు సమాచారం అందించారు. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన సహాయక బృందాలు గంటలపాటు శ్రమించి 12 మంది కార్మికులను సొరంగం నుంచి క్షేమంగా బయటకు తీశాయి. ఒక్క ఫోన్ కాల్​తో తమకు కొత్త జీవితం లభించినట్లయిందని వారంతా ఆనందంతో మునిగి తేలుతున్నారు.

ఉత్తరాఖండ్​లోలో ఆదివారం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా చమోలీలోని తపోవన్ ప్రాజెక్టులో పనిచేస్తోన్న కార్మికులు ఎదుర్కొన్న భయానక పరిస్థితి ఇది. వరదలు ముంచెత్తి వారంతా ఓ సొరంగంలో చిక్కుకున్నారు. కొన్ని గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఐటీబీపీ సహాయక సిబ్బంది వీరిని సోమవారం బయటకు తీశారు. అనంతరం జోషిమఠ్​లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్పందించే లోపే..

" మమ్మల్ని సొరంగం నుంచి బయటకు రావాలని కొందరు పెద్దగా అరవడం మాకు వినిపించింది. కానీ మేము స్పందించే లోపే ఒక్కసారిగా భారీ వరద వచ్చింది. బురద మమ్మల్ని ముంచెత్తింది' అని సహాయక బృందాలు రక్షించిన కార్మికుడు లాల్ బహదూర్​ తెలిపాడు. అతనితో పాటు మరో 11మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

సొరంగంలో చిక్కుకున్న వీరందరినీ కాపాడేందుకు 7 గంటలపాటు శ్రమించినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

వరద వచ్చినప్పుడు తాము సొరంగంలో 300 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు మరో కార్మికుడు, నేపాల్​ నివాసి బసంత్​ తెలిపాడు.

సొరంగంలోకి నీరు చేరినప్పుడు పైకి రావడానికి ప్రయ్నతించడం తప్ప మరో గత్యంతరం లేదని చమోలిలోని ఢాక్ గ్రామానికి చెందిన మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెల్లడించాడు.

" మేం ఆశలు వదులుకున్నాం. కానీ కొంచెం వెలుతురు, గాలి వచ్చాక మాలో ఒకరి మొబైల్ ఫోన్లో సిగ్నల్ రావడం గమనించాం. వెంటనే అతను మా జనరల్ మేనేజర్​కు సమాచారం అందించాడు." అని కార్మికుడు తెలిపాడు. తమను కాపాడిన ఐటీబీపీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు.

9 గ్రామాలు ప్రభావితం..

వరదల కారణంగా ప్రభావితమైన 9 గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాతున్నాయి. అక్కడి ప్రజలకు చాపర్ల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు.

ఉత్తరాఖండ్ వరదలో ఇప్పటి వరకు 18 మంది మరణించారు. మొత్తం 202 మంది గల్లంతయ్యారు. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details