ఉత్తరాఖండ్లో మంచు చరియలు విరిగిపడి సంభవించిన జలవిలయం కారణంగా మరణించిన వారి సంఖ్య 20కి పెరిగింది. ఇంకా 197 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. పవర్ ప్రాజెక్టులోని సొరంగాలలో చిక్కుకున్న 30మంది కార్మికులను బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తవ్వేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నందన మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ప్రాణ రక్షణే ప్రధానం...
వరదల్లో గల్లంతైన వారి ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వరదల కారణంగా ప్రభావితమైన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది హామీ ఇచ్చారు. ప్రమాదం కారణంగా వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందన్నారు. ఈ ఘోర విపత్తుకు పూర్తి కారణాలను అన్వేషిస్తామని చెప్పారు. అందుకోసం ఇస్రో, డీఆర్‌డీఓ సాయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే డీఆర్‌డీఓ బృందం కారణాలను అన్వేషిస్తోందని, ఇస్రో సాయాన్ని కూడా కోరామని పేర్కొన్నారు.
మంచు చరియలు విరగలేదు..
అందరూ అనుకుంటున్నట్లు హిమనీనదం కట్టలు తెంచుకోవడం వల్ల వరదలు సంభవించలేదని రావత్ వెల్లడించారు. ఈ విషయాన్ని తనకు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారని చెప్పారు. రెండు మూడు రోజులుగా మంచు భారీగా కురిసిందని.. ఒకేసారి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల మంచు నదిలో చేరడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని వివరించారు. మంచు చరియలు కూలినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారని వివరించారు. హిమనీనదం కట్టలు తెంచుకుందని చెబుతున్న ప్రాంతంలో అలాంటి ఘటనలు జరిగే అవకాశం లేదన్నారు.