Gita Press Gandhi Prize : 2021 ఏడాదికిగాను 'గాంధీ శాంతి బహుమతి'కి ఎంపిక కావడం ఎంతో గౌరవప్రదమని ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన గీతా ప్రెస్ పేర్కొంది. అయితే, విజేతగా నిలిచిన వారికి అందించే రూ. కోటి నగదును తాము స్వీకరించబోమని స్పష్టం చేసింది. అభినందన పత్రం, జ్ఞాపిక, సంప్రదాయ హస్త కళాకృతులను మాత్రం తీసుకుంటామని తెలిపింది. నగదు రూపంలో వచ్చే బహుమతులు, విరాళాలు స్వీకరించకూడదని సంస్థ ప్రథమ సూత్రం అని గీతా ప్రెస్ ప్రతినిధులు తెలిపారు. తమకు వచ్చే ఈ నగదును ఎక్కడైన వేరే మంచి పనులకు ఖర్చు చేయాలని గీతాప్రెస్ బోర్డు ప్రభుత్వాన్ని కోరింది.
మహాత్ముడు దేశానికి నేర్పిన శాంతి మార్గంలో నడుస్తున్న సంస్థలు, వ్యక్తులను గుర్తించి వారిని గౌరవించుకునేందుకు ప్రవేశపెట్టిందే ఈ 'గాంధీ శాంతి బహుమతి'. ఈ అవార్డును 1995లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆదివారం.. అవార్డు ఎంపిక కమిటీ సమావేశమైంది. ఈ అవార్డు కోసం గీతాప్రెస్‌ను కమిటీ ఏకగీవ్రంగా ఎన్నుకుంది. కాగా గీతాప్రెస్‌ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేయడంపై వివాదం తలెత్తింది. గాంధీ శాంతి బహుమతిని ఈ సంస్థకు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అయితే కాంగ్రెస్ పార్టీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది.
ఈ ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి అవార్డును గెలుచుకున్న గీతాప్రెస్ సంస్థను సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. గీతాప్రెస్ నిస్వార్థంగా అనేక పవిత్ర గ్రంథాలను ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని షా అభినందించారు. ' భారతీయ సనాతన సంస్కృతి, ప్రాచీన గ్రంథాలు ఈరోజు ప్రజలందరూ సులభంగా చదవగలుగుతున్నారంటే.. అందులో గీతాప్రెస్ సంస్థ సహకారం వెలకట్టలేనిది. రామ్ చరిత్ మానస్ నుంచి శ్రీ మత్ భగవత్గీత వరకూ.. అనేక పవిత్ర గ్రంథాలను గీతాప్రెస్ దాదాపు 100 ఏళ్లకు పైగా నిస్వార్థంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది' అని అమిత్ షా ట్విట్టర్లో తెలిపారు.
'గీతాప్రెస్' గాంధీ శాంతి అవార్డు గెలుచుకున్న సందర్భంగా.. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. "ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి బహుమతిని గీతాప్రెస్ పొందినందుకు వారిని అభినందిస్తున్నాను. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన స్టేట్మెంట్ చూశాను. వారి అల్ప బుద్ధికి చింతిస్తున్నాను" అని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. గాంధీ శాంతి అవార్డును గెలుచుకున్న గీతాప్రెస్‌ను అభినందించారు. భారతదేశ సనాతన సంస్కృతి పరిరక్షణలో శతాబ్ద కాలం నుంచి గీతాప్రెస్ సహకారం వెలకట్టలేనిదిగా పేర్కొన్నారు. 'గాంధీ శాంతి బహుమతి-2021 పొందిన గోరఖ్‌పూర్ గీతా ప్రెస్ సంస్థకు హృదయపూర్వక అభినందనలు' అని నడ్డా ట్వీట్ చేశారు.