పంజాబ్‌లోని ఓ గ్రామ పంచాయతీ కమిటీ వినూత్న నిర్ణయాలు తీసుకుంది. గ్రామ ప్రజలు అనవసర ఖర్చులు చేయకుండా ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. యువతులెవ్వరు వివాహాల్లో లెహంగా ధరించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి దాటాక పెళ్లి బరాత్ నిర్వహించవద్దని తెలిపింది. గ్రామంలో గుట్కాలు అమ్మకుండా, కొనకుండా నిషేదం విధించింది. కపుర్తలా జిల్లాలోని భదాస్ గ్రామ పంచాయతీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
వివాహాల్లో లెహంగాలు నిషేధం.. పెళ్లి బరాత్‌లు బంద్! ఆహారం ఇంటికి తీసుకెళ్తే రూ.30వేల ఫైన్
గ్రామ ప్రజలు అనవసర ఖర్చులు చేయకుండా పంచాయతీ కమిటీ ఓ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. పెళ్లి కార్యక్రమాలపై పలు ఆంక్షలు విధించింది. వివాహాలలో వేసుకునే దుస్తులపైనా నిబంధనలు పెట్టింది. అవేంటంటే?
గ్రామంలో ఎవరి పెళ్లి జరిగినా కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని చెబుతున్నారు పంచాయతీ పెద్దలు. రాత్రి 12 గంటలలోపే బరాత్ సహా మిగతా అన్ని కార్యక్రమాలు ముగించాలని తెలిపారు. పెళ్లిలో యువతులు లెహంగా కాకుండా కేవలం చుడిదార్నే ధరించాలని స్పష్టం చేశారు. వివాహం తరువాతి రోజు పెళ్లి కొడుకు కుటుంబం మాత్రమే అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లాలన్నారు. నిబంధనలను ఉల్లఘింస్తే 11వేల రూపాయల జరిమానా కట్టాలని తేల్చి చెప్పారు. గురుద్వారాల పవిత్రత, గౌరవాన్ని కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ పెద్దలు వివరించారు.
గ్రామంలో ఏర్పాటు చేసే లంగర్ నుంచి.. ఆహారాన్ని టిఫిన్ బాక్స్‌ల్లో, కవర్లలో ఇంటికి తీసుకువెళ్లొద్దని మరిన్ని ఆదేశాలు జారీచేశారు గ్రామ పెద్దలు. అలా చేసిన వారికి రూ.10 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. దోషిగా తేలినవారు గురుద్వారాలో రెండు నెలల పాటు సేవ చేయాలని తీర్మానించారు. గ్రామ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు ఎవరైనా ఈ ఇలాంటి పనులు చేస్తే రూ.30వేల జరిమానాతో పాటు మూడు నెలల పాటు గురుద్వారాలో సేవ చేసేలా నిబంధన తీసుకొచ్చారు. గ్రామంలో డ్రగ్స్, జర్దా, పొగాకు, కైనీ వంటివి అమ్మినట్లయితే రూ.5వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు.