Girls Eating Contaminated Food Sick In Wanaparthy : కలుషిత ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన వనపర్తి జిల్లాలో కలకలం సృష్టించింది. రాత్రి తీసుకున్న భోజనం వికటించి 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ఉదయం సమీపంలోని ఆత్మకూరు ఆస్పత్రిలో చికిత్స అందించగా.. వీరిలో 8 మంది పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో వీరిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేజీబీవీని అధికారులు, పోలీసులు పరిశీలించి.. ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.
వనపర్తిలోని అమరచింత కస్తూర్బా విద్యాలయంలో మొత్తం 271 మంది విద్యార్థినులు చదువుతుండగా.. గురువారం 211 మంది హాజరయ్యారు. వీరికి నిన్న రాత్రి సిబ్బంది వంకాయ, సాంబారుతో కూడిన ఆహారాన్ని వడ్డించారు. రాత్రి భోజనం అయ్యాక 11గంటల ప్రాంతంలో విద్యార్థినులకు కడుపు నొప్పి మొదలు కావటంతో.. ఒక్కొక్కరుగా సిబ్బంది వద్దకు వెళ్లారు. కేజీబీవీలో ఒక టీచర్, వాచ్‌మెన్ మాత్రమే ఉండటంతో రాత్రి విద్యార్థినులకు బయటికి పంపలేదు. రాత్రంతా పరిస్థితి అలాగే ఉండటంతో తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆటో తీసుకువచ్చిన విద్యార్థులందరిని సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.