Girl Swimming Video :9 ఏళ్ల బాలిక తన ప్రతిభతో అందరినీ ఆశ్చపరిచింది. 5 గంటల పాటు నిరంతరాయంగా నీటిలో ఈది గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 12 గంటలపాటు ఈదడమే తన తదుపరి లక్ష్యమని చెప్పింది. ఆమెనే ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన తనుశ్రీ కోసరే.
జిల్లాలోని పురఈ అనే గ్రామం క్రీడలకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామానికి చెందిన ప్లేయర్లు ఖోఖో, కబడ్డీ, స్విమ్మింగ్ వంటి క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. దేశానికీ గుర్తింపు తెచ్చిపెట్టారు. ఆ బాటలోనే తనుశ్రీ కొసరే అనే బాలిక నడిచింది. స్విమ్మింగ్‌పై ఆసక్తితో ఫ్లోటింగ్ వింగ్స్ స్విమ్మింగ్ అకాడమీలో చేరి శిక్షణ తీసుకుంది. ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు సాధన చేసేది.
Golden Book Of World Record :ఆదివారం ఐదు గంటల పాటు ఏక బిగిన చెరువులో ఈది.. వరల్డ్ రికార్డ్ సృష్టించింది. గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. బాలిక స్విమ్మింగ్ చేస్తుండగా గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు చెరువు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని తనుశ్రీని ప్రోత్సహించారు. చెరువులో నుంచి బయటకు వచ్చిన తనుశ్రీకి కేరింతలలో స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 12 గంటల పాటు నిరంతరాయంగా ఈదడమే తన లక్ష్యమని చెబుతోంది తనుశ్రీ. తనుశ్రీ సాధించిన ఈ విజయంపై ఆసియా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సభ్యుడు అలోక్ కుమార్ స్పందించారు. 'దేశంలో, ప్రపంచవ్యాప్తంగా అద్భుత ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డు ఇస్తారు. 9 ఏళ్ల బాలిక 5 గంటలపాటు ఈది ప్రపంచ రికార్డు సృష్టించింది. మొత్తం ప్రక్రియ ముగిశాక బాలికకు సర్టిఫికేట్ ఇచ్చాం' అని వివరించారు.