girl set fire by boyfriend: తన పుట్టినరోజు వేడుకలు ఉన్నాయంటూ ఇంటికి పిలిచి ఓ 16 ఏళ్ల బాలికకు నిప్పంటించాడు యువకుడు. ఆ తర్వాత తానూ నిప్పుపెట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది: జిల్లాలోని కొల్లెంగోడ్ గ్రామానికి చెందిన బాలసుబ్రమణియం(23) తన బర్త్డే ఉందంటూ ఆ బాలికను ఇంటికి పిలిచాడు. ఉదయం 7 గంటలకు ఇంటికి వెళ్లిన ఆమెను గదిలోకి తీసుకెళ్లి నిప్పంటించాడు. ఆ తర్వాత తానూ అంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ సమయంలో ఇంట్లో బాలసుబ్రమణియం తల్లి, తమ్ముడు మాత్రమే ఉన్నారు. తీవ్ర గాయాలైన ఇరువురిని స్థానికుల సాయంతో తొలుత త్రిస్సూర్ వైద్య కళాశాలకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందారు.