హరియాణా పానీపత్‌లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేశాడు ఓ వ్యక్తి. నిందితుడ్ని యమునానగర్‌కు చెందిన యోగేశ్‌గా పోలీసులు గుర్తించారు. కోల్‌కతాలోని హౌరా రైల్వే స్టేషన్లో అతడిని అరెస్ట్ చేసి పానీపత్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దీపావళి పండుగ రోజు రాత్రి పానీపత్‌లోని కుల్‌దీప్ నగర్‌లోని తన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను నిందితుడు యోగేశ్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసి బాధితురాలి ఇంటి పెరట్లో పడేశాడు. బాలిక కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. ఎంతకీ ఆమె ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు ఉదయం తన ఇంటి పెరట్లో చిన్నారి విగతజీవిగా కనిపించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు బాలిక కుటుంబ సభ్యులు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ. 50 వేల రూపాయల రివార్డును ప్రకటించారు పోలీసులు. పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న నిందితుడు యోగేశ్ ఇంటికి తాళం వేసి ఉండడం పోలీసులు గుర్తించారు. అనుమానం వచ్చిన పోలీసులు.. యోగేశ్ మొబైల్ కాల్ డేటాను పరిశీలించారు. యోగేశ్ ఇంటి తలుపులు పగలగొట్టగా అందులో రక్తంతో తడిసిన మహిళ బట్టలు కనిపించాయి.
నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉంది. అంతకుముందు చిన్నారులపై వేధింపులకు పాల్పడినందుకుగానూ నిందితుడు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు.
బధిర యువతిపై..
రాజస్థాన్ ఉదయపుర్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల బధిర యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను బాధితురాలు గుర్తించింది. వారు కూడా బధిరులే.
అక్టోబరు 21న బాదితురాలు నిరాశ్రయురాలిగా కనిపించడం వల్ల పోలీసులు ఆమెను షెల్టర్ హోమ్‌కు తరలించారు. బుధవారం అర్ధరాత్రి యువతి.. షెల్టర్ హోమ్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో గోడపై నుంచి పడి ఆమె కాలు విరిగింది. అనంతరం బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం చేసిన వైద్య పరీక్షల్లో బాధితురాలు ఐదు నెలల గర్భిణీ అని తేలిందని హిరాన్ మగ్రి పోలీసులు తెలిపారు. తనపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలు.. అనువాదకుడి సాయంతో సైగల ద్వారా తెలియజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రేమను నిరాకరించిందని..
కేరళ కొట్టాయంలో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో మైనర్‌పై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. బాధితురాలి చేయిని అడ్డుగా పెట్టడం వల్ల ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే బాధితురాలు కారుకాచల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు అఖిల్(21)ను అరెస్ట్ చేశారు. నిందితుడు.. బాధితురాలిని ఇంతకు ముందు వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.