HIV Positive Lovers: అసోంకు చెందిన ఓ యువతి.. తన ప్రియుడి కోసం ఎవరూ చేయని సాహసం చేసింది. ప్రేమికుడి నుంచి ఎవరూ తనను దూరం చేయకూడదని హెచ్ఐవీ ఉన్న తన లవర్ రక్తాన్ని.. శరీరంలోకి ఎక్కించుకుంది. ఈ విషయం తెలిసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అసలేం జరిగిందంటే?.. కామ్రూప్ జిల్లాలోని సువల్కచి గ్రామానికి చెందిన ఆ యువతికి (19).. పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడితో మూడేళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో మునిగితేలారు. అయితే ఆ యువకుడు హెచ్ఐవీ వైరస్‌తో పోరాడుతున్నాడు. అది తెలిసి కూడా యువతి తన లవర్‌తో మూడు సార్లు గ్రామాన్ని విడిచి పారిపోయింది. కానీ ప్రతిసారి ఆమె కుటుంబసభ్యులు వారిని వెతికి తీసుకొచ్చారు.
సిరంజి సహాయంతో.. అది తట్టుకోలేకపోయిన ఆ యువతి.. సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. సిరంజితో తన బాయ్‌ఫ్రెండ్ రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకుంది. విషయం తెలిసిన యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం యువతికి పోలీసులు.. వైద్య పరీక్షలు జరిపించగా హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్నట్లు నిర్ధరణ అయింది.
'అందుకే ఆ పని చేశా'.. స్థానిక మీడియాతో మాట్లాడిన యువతి.. తాను ప్రియుడి రక్తాన్ని ఎక్కించుకున్నట్లు తెలిపింది. ఇక తనను ఎవరూ తన ప్రియుడి నుంచి వేరుచేయలేరని చెప్పింది. తన ప్రేమను బతికించుకునేందుకే ఈ పనిచేసినట్లు పేర్కొంది. జైలులో ఉన్న తన ప్రియుడు అమాయకుడు అని.. అతడ్ని విడిచిపెట్టాలని కోరింది.