ముక్కుకు ఆక్సిజన్ పైపు.. చేతికి సెలైన్ ఉన్నా.. ఆసుపత్రి బెడ్ మీద పాటలు వింటూ ఆనందంగా కన్పించిన యువతి గుర్తుందా. గత వారం సోషల్‌మీడియాలో వైరల్ అయి ఎంతోమందిలో స్ఫూర్తిని నింపిన ఆమె.. కరోనా ముందు ఓడిపోయింది. కొవిడ్‌పై చేసిన పోరాటంలో ఆ ధైర్యమైన గుండె ఆగిపోయింది.
ఎంతో ధైర్యంగా..
దిల్లీకి చెందిన డాక్టర్ మోనిక గతవారం తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. కరోనా సోకిన ఓ యువతికి ఐసీయూ బెడ్ దొరక్కపోవడంతో సదరు ఆసుపత్రి సిబ్బంది కొవిడ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. రెమ్‌డెసివిర్, ప్లాస్మాథెరపీతో పాటు ఎన్‌ఐవీ సపోర్ట్ అందించారు. సాధారణంగా అలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఎవరైనా భయపడతారు.. కుంగిపోతారు. కానీ, ఆ అమ్మాయి మాత్రం ఎంతో ధైర్యంగా కన్పించింది. పాటలు వినాలని ఉందంటే డాక్టర్లు అందుకు ఒప్పుకున్నారు. బెడ్‌పై ఫోన్లో 'లవ్ యూ జిందగీ' పాట వింటూ చిరునవ్వులు చిందించిన ఆమె వీడియోను డాక్టర్ మోనిక మే 8న పోస్ట్ చేయగా.. ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.