Girl Record In Skating : మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన పదకొండేళ్ల సృష్టి శర్మ తన అద్భుతమైన ప్రతిభతో ఆరు సార్లు గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. లింబో స్కేటింగ్‌లో వివిధ విభాగాల కింద అద్భుత ప్రదర్శన కనబరిచి గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. శరీరం మొత్తాన్ని పూర్తిగా కిందికి వాల్చి నేలకు సమాంతర ఎత్తులో ఉన్న.. కర్రలు లాంటి వాటి కింద నుంచి స్కేటింగ్ చేయడాన్నే లింబో స్కేటింగ్ అంటారు.
స్కేటింగ్‌లో 'సృష్టి' అదుర్స్.. 11ఏళ్లలో 6 గిన్నిస్ రికార్డులు.. మరో రెండు వెయిటింగ్! - limbo skating guines record
Girl Record In Skating : పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు నాగ్‌పుర్‌కు చెందిన ఓ బాలికకు చిన్న వయసే అయినా అద్భుత ప్రతిభ కనబరుస్తూ రికార్డుల్లోకెక్కింది. లింబో స్కేటింగ్ చేస్తూ సృష్టి శర్మ అనే బాలిక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకుంది. ఒకసారి గిన్నిస్ రికార్డులోకి పేరు చేరితేనే తెగ ఆనందపడిపోయే రోజుల్లో సృష్టి శర్మ మాత్రం 6 సార్లు గిన్నిస్‌లోకి ఎక్కి తన రికార్డులను చూసి అందరూ అసూయ పడేలా దూసుకెళ్తోంది.
ప్రపంచంలోనే తొలి ఐస్ లింబో స్కేటర్‌గా..
Skating Girl Guiness Record : సృష్టి శర్మ తొలిసారిగా 2017 డిసెంబర్ 27న అత్యల్ప లింబో ఐస్ స్కేటింగ్ కోసం 10 మీటర్లకు పైగా ప్రయత్నించింది . 20 సెంటీమీటర్ల లక్ష్యానికి గానూ 17.78 సెంటీమీటర్లను విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ లింబో స్కేటర్‌గా పేరు పొందింది. లింబో స్కేటింగ్‌తో పాటు షార్ట్ ట్రాక్ ఐస్ స్పీడ్ స్కేటింగ్ కూడా ఆమె చేస్తోంది. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సృష్టి శర్మ.. కాంస్య పతకాన్ని కూడా సాధించింది. భారతదేశం గర్వపడేలా శీతాకాల ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం సృష్టి కోరిక అని ఆమె తండ్రి ధర్మేంద్ర శర్మ తెలిపారు.
'అక్కను చూసి నేను కూడా..'
అయితే స్కేటింగ్ చేయాలని తొలుత తాను భావించలేదని.. తన అక్క స్కేటింగ్ చేయడాన్ని చూసి తాను కూడా ఆకర్షితురాలైనట్టు సృష్టి తెలిపింది. భవిష్యత్తులో భారత్ తరఫున ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించి స్వర్ణ పతకం సాధించాలనేది తన కల అని ఆమె తల్లి శిఖా శర్మ తెలిపారు. మరిన్ని రికార్డులను సాధించే ప్రయత్నంలో స్కేటర్ సృష్టి శర్మ తన రెండు సొంత రికార్డులను బద్దలు కొట్టింది. కర్రల కింద వేగంగా 50 మీటర్లకు పైగా లింబో స్కేట్ చేయడం చేసి.. 10 కర్రలకుపైగా కింద నుంచి వేగంగా లింబో స్కేట్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు రికార్డులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తింపును పొందాల్సి ఉంది.