ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. బీమా కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం జరిగింది. అఘాయిత్యం అనంతరం నిందితులు.. బాధితురాలిని కారు నుంచి బయటకు తోసేసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమేఠికి చెందిన ఓ యువతి ప్రయాగ్‌రాజ్‌లో నివాసం ఉంటూ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు తెలిసిన ఓ యువకుడు బీమా పాలసీని ఇప్పిస్తానని నమ్మించి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం బాధితురాలికి మత్తుమందు కలిపిన నీరును ఇచ్చాడు. ఆ నీరు తాగి యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో బాధితురాలి స్నేహితుడు.. అతని సహచరులు కలిసి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రతాప్‌గఢ్ వరకు(దాదాపు 60 కి.మీ) ఆమెను కారులో తిప్పారు. కదులుతున్న కారులోనే యువతిపై అత్యాచారం చేశారు.
అనంతరం బాధితురాలిని ప్రతాప్‌గఢ్‌లో రోడ్డు పక్కన పడేసి.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతిని అంబులెన్స్‌లో ప్రతాప్‌గఢ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాధితురాలికి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. బాధితురాలు కాస్త కోలుకున్నాక సోమవారం ఉదయం ప్రతాప్‌గఢ్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేసున్నారు.