ఇంజినీరింగ్ విద్యార్థి ఆమె. సంప్రదాయ పెయింటింగ్ అంటే ఆసక్తితో వాడేసిన ఖాళీసీసాలు, పాడైపోయిన విద్యుత్ బల్బులు, నున్నటి రాళ్లపై రంగులు, బ్రష్‌తో అందమైన చిత్రాలు గీస్తోంది. విష్ణుభగవానుడి అన్ని అవతారాలను ప్రతిబింబించే సుందరమైన చిత్రాలను తీర్చిదిద్దింది భాగ్యశ్రీ.
లాక్‌డౌన్ సమయాన్నంతా పట్టచిత్ర కోసమే కేటాయించింది భాగ్యశ్రీ. అదే ఆమెకు ఇంతటి గుర్తింపు తెచ్చిపెట్టింది. మన్‌కీబాత్‌లో ప్రధాని నరేంద్రమోదీ సైతం ఆమె పేరును ప్రస్తావించారు. ప్రస్తుత తరానికి భాగ్యశ్రీ ఆదర్శమని కొనియాడారు. ఆ తర్వాత.. పట్టచిత్రకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్న ఈ కళాకారిణి పేరు దేశమంతా మారుమోగిపోయింది.
మాకు చాలా సంతోషంగా, తనను చూస్తే గర్వంగా ఉంది. కష్టపడి చదువుతుంది. చాలా తెలివైంది. ఆ తెలివితేటలే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.
-మధుస్మితాదాస్, భాగ్యశ్రీ వదిన
ఒడిశాలోని రూర్కెలాకు చెందిన భాగ్యశ్రీ..ఎంటెక్ చదివింది. చిన్నప్పటినుంచీ పెయింటింగ్‌పై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. పట్టచిత్ర పుట్టినిల్లుగా చెప్పుకునే పూరీ జిల్లాలోని రఘురాజ్‌పూర్‌కు ఓసారి కుటుంబంతో కలిసి వెళ్లింది భాగ్యశ్రీ. అక్కడి పెయింటింగ్స్ చూసి, వాటికి ఆకర్షితురాలైంది. ఎలాగైనా పట్టచిత్ర కల నేర్చుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంది. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని, జగన్నాథుడినే గురువుగా భావించి, ఆ కళపై పట్టు సాధించింది. కొద్దికాలంలోనే సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఆన్‌లైన్ వేదికగా తన కళాఖండాలను విక్రయిస్తోంది.
ఎవరిదగ్గరా పెయింటింగ్ నేర్చుకోలేదు. చిన్నప్పటినుంచీ ఆసక్తి ఉండేది. ఆ అభిరుచి కోసమే కొంత సమయం కేటాయించేదాన్ని. పట్టచిత్ర గురించి తెలిసిన తర్వాత, ఏదో ఒకరోజు ప్రయత్నించాలని అనుకున్నా. లాక్‌డౌన్ కాలంలో కావల్సినంత సమయం దొరకడంతో..పూర్తి శ్రద్ధ పెట్టా. ప్రధాని నరేంద్రమోదీ వద్దకు నా పెయింటింగ్స్ చేరిన తర్వాత, మన్‌కీబాత్‌లో ఆయన నన్ను ప్రస్తావించారు. అప్పటినుంచీ వివిధ ప్రాంతాల నుంచి, నాకు ప్రశంసలు అందుతున్నాయి. ఇందుకు మోదీ గారికి నా కృతజ్ఞతలు.
-భాగ్యశ్రీ సాహు, పట్టచిత్ర కళాకారిణి