girl fell into borewell : మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లాలో మంగళవారం 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారి మరణించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఫ్ బృందాలు, పోలీసులు జేసీబీలతో దాదాపు 55 గంటలపాటు శ్రమించి సహాయక చర్యలు చేపట్టి చిన్నారిని బోరు బావి నుంచి గురువారం సాయంత్రం బయటకు తీశారు. అలాగే రోబోటిక్ బృందం సాయం తీసుకుని అధికారులు చిన్నారిని బోరు బావి నుంచి బయటకు తీశారు. హుటాహుటిన అంబులెన్స్‌లో బాలికను సీహోర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.
"బోరు బావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారి మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. బాధితురాలి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షలకు తరలించాం. గురువారం సాయంత్రం 5.30 గంటల సమయానికి చిన్నారిని బోరు బావి నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం. అయినా ఫలితం లేకపోయింది. బాలిక 135 అడుగుల లోతుకు జారిపోయింది. ఆర్మీ బృందం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎంతో కష్టపడి సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. రోబోటిక్ నిపుణుల బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది."
-- పోలీసులు
సీహోర్ జిల్లా ముగావళి గ్రామానికి చెందిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మంగళవారం బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం నుంచే సహాయక చర్యలు ప్రారంభించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 6 జేసీబీలు, ఇతర యంత్రాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్య్కూ ఆపరేషన్ చేపట్టింది. తాడు సహాయంతో చిన్నారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నించింది. అయినా కుదరలేదు. ఆఖరికి 55 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టినా చిన్నారి ప్రాణాలు దక్కలేదు.
బ్రిడ్జి పిల్లర్‌లో ఇరుక్కుని బాలుడు మృతి
బిహార్.. రోహ్తాస్లోని ఘోరం జరిగింది. సోన్ నదిపై నిర్మించిన బ్రిడ్జిపై ఉన్న రెండు పిల్లర్ల మద్య ఇరుక్కుని రంజన్ కుమార్ (12) అనే బాలుడు మృతి చెందాడు. దాదాపు 25 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. బాలుడిని బయటకు తీశారు అధికారులు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.