Girl Died of a Heart Attack While Going to School :పాఠశాలకు బయలుదేరిన 12 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. స్కూల్ ఎదుటే కుప్పకూలి కన్నుమూసింది. ఈ ఘటన కర్ణాటక చిక్కమగళూరులోని జొగన్నకెరె గ్రామంలో జరిగింది. ఇంత చిన్న వయసులోనే గుండె పోటుతో మరణించడం వల్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇదీ జరిగింది
దరదహల్లి గ్రామానికి చెందిన అర్జున్, సుమ దంపతులకు 12 ఏళ్ల బాలిక శ్రీష్టి సంతానం. ఈమె గ్రామంలోనే ఉన్న పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే రోజులాగే స్కూల్కు బయలుదేరిన బాలిక, ఒక్కసారిగా పాఠశాల ఎదుట కుప్పకూలింది. దీనిని గమనించిన తోటి విద్యార్థినులు, స్థానికులు హుటాహుటిన ఎదురుగా ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల వెంటనే ముడిగెరే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించారు. స్థానిక ఆస్పత్రిలో వైద్యులు ఉంటే బాలిక మరణించేది కాదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"జొగన్నకెరే ప్రైమరీ హెల్త్ సెంటర్కు సంబంధించిన వైద్యులు గత 20 రోజులుగా రావడం లేదు. వారిని సంప్రదిస్తే శిక్షణ కార్యక్రమానికి వెళ్లామని చెప్పారు. ఉన్నతాధికారులు మరో వైద్యుడిని ఇక్కడికి పంపించలేదు. ఒకవేళ ఇక్కడ వైద్యుడు ఉంటే బాలిక బతికి ఉండేది."