ఝూర్ఖండ్ దుమ్కాలో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ యువకుడు. బాధితురాలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు వైద్యులు. నిందితుడు షారుక్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న అంకితను ప్రేమించమని వేధింపులకు గురిచేసేవాడు షారుక్ హుస్సేన్ అనే యువకుడు. అందుకు అంకిత అంగీకరించకపోవడం వల్ల ఆగస్టు 23వ తేదీ వేకువజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాలిన గాయాలతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి అంకిత మరణించింది. ఈ విషయం బయటకు తెలియడం వల్ల దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా, భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని మార్కెట్లను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసేశారు. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు షారుక్‌ను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ఉరితీయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.