Bus Accident In Jharkhand : ఝార్ఖండ్.. గిరిడీహ్ జిల్లాలోని బరాకర్ నదిలో శనివారం రాత్రి ఓ బస్సు అదుపుతప్పి పడిపోయిన ఘటనలో నలుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. మరో 15 మంది గాయపడ్డారని వెల్లడించారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని వారు వివరించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు అందించారు. స్థానికులు సైతం సహాయక చర్లల్లో పాల్గొని ఆసరాగా నిలిచారని అధికారులు తెలిపారు. మృతి చెందిన నలుగురిలో ముగ్గురిని గుర్తించామన్న అధికారులు.. శవ పరీక్షల కోసం మృతదేహాలను ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. మృతులను సంతోశ్ అగర్వాల్, మానిక్ చంద్ గుప్తా, ధనియాగా గుర్తించినట్లు వెల్లడించారు. కాగా బస్సు డ్రైవర్ ఇంకా పరారీలోనే ఉన్నాడని తెలిపారు.
ప్రమాదం జరిగింది ఇలా..
Giridih Bus Accident : రాంచీ నుంచి గిరిడీహ్ వెళ్తున్న ఓ బస్సు బరాకర్ నదిలో పడిపోయింది. రాంచీలో బయలుదేరిన బస్సు.. బరాకర్ నది వద్దకు చేరుకోగానే అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ప్రయాణికుల కేకలు విన్న స్థానికులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత డీసీ నమన్ ప్రియేష్ లక్డా, ఎస్పీ దీపక్ శర్మ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముమ్మరంగా సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.