తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా - షర్మిల కోసమేనా!

AP PCC President Gidugu Rudraraju: ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపించారు. వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకే గిడుగు రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

AP PCC President Gidugu Rudraraju
AP PCC President Gidugu Rudraraju

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 2:48 PM IST

Updated : Jan 15, 2024, 3:38 PM IST

AP PCC President Gidugu Rudraraju: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్​ పార్టీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. తాజాగా ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు పంపించారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో, పీసీసీ చీఫ్‌గా షర్మిల నియామకానికి లైన్‌ క్లియర్‌ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

23 నవంబర్, 2022న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ గిడుగు రుద్రరాజు నియమింపబడ్డారు. గిడుగును అధ్యక్షుడిగా నియమించిన తరువాత ఆయన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లయినా తిరిగి కోలుకోలేదు. కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. కోలుకోలేనంత అగాథంలో కూరుకుపోయిన ఏపీ కాంగ్రెస్‌కు షర్మిల రాక కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. దివంగత YS రాజశేఖర్‌రెడ్డి కుమార్తె కావడం, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సోదరి కావడంతో ఆమె చేరిక కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చేలా ఉంది. ఇప్పటికే వైకాపాను వీడిన పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు..

షర్మిల వల్ల వైఎస్సార్సీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు: సజ్జల

వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం:షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే పలు కీలక విషయాలు స్ఫురణకు వస్తాయి. షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‍రెడ్డి కుమార్తె. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆమె 2012-2013లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. వైఎస్సార్​సీపీ అధ్యక్షుడైన షర్మిల అన్న జగన్ మోహన్ రెడ్డి తరపున ఆమె ప్రచార బాధ్యతలు తీసుకుని ప్రజలకు మరింత చేరువయ్యారు. అనంతరం రాష్ట్రానికి సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడం, కుటుంబంలో నెలకొన్న సమస్యల కారణంగా ఆమె వైఎస్సార్​సీపీకి దూరమయ్యారు.

చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల - కుమారుడి పెళ్లికి ఆహ్వానం

షర్మిల అన్న వైఎస్ జగన్ తనను దూరం పెట్టిన తరువాత షర్మిల వైఎస్సార్టీపీ పేరుతో తెలంగాణలో పార్టీని పెట్టారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై గత నాలుగు సంవత్సరాలుగా పోరాడారు. ఎన్నికలు సమీపిస్తున్న చివరి నిమిషంలో పోటి చేయకుండానే కాంగ్రెస్​ పార్టీకి మద్దతు ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే వైఎస్ షర్మిల దిల్లీకి వెళ్లి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో చర్చలు జరిపారు. అయితే, అప్పట్లో సీట్ల కేటాయింపులు, ఎంపీ సీట్ల కోమే కాంగ్రెస్​లో చేరుతుందని వార్తలు వచ్చినప్పటికీ, ఎలాంటి సీట్లను ఆశించకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆ సందర్భంగా దిల్లీ పెద్దలు షర్మిలకు ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకే షర్మిల కోసం గిడుగు రుద్రరాజు తన పీసీసీ పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా - షర్మిల కోసమేనా!
Last Updated : Jan 15, 2024, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details