కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో సహా మరికొందరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడటానికి రాహుల్ గాంధీయే ముఖ్య కారణమని అన్నారు. ఆ పార్టీలో కొనసాగాలంటే వెన్నెముక లేని వ్యక్తిగా ఉండాలని చెప్పారు. తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరుకున్నప్పటికీ వారి చేతిలో ఏమీలేదని అన్నారు.
తన చేరికను రాహుల్ కోరుకున్నా.. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని ఆజాద్ అన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఆజాద్ చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో అంటరానితనం లేదని.. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే బీజేపీతో చేతులు కలుపుతానని పరోక్షంగా తెలిపారు.
"ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పనిచేసిన దాంట్లో 1/50 పని చేసినా రాహుల్ సక్సెస్ అయ్యేవారు. రాజకీయాలంటే.. మొదట పార్టీ, ప్రజలు, దేశం పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. 2013లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్‌ను చింపేయకుండా ఉంటే.. ఈరోజు రాహుల్ గాంధీ అనర్హత నుంచి బయటపడేవారు. అయితే, అప్పుడు ఉన్నది బలహీనమైన క్యాబినెట్. రాహుల్ గాంధీ తిరస్కరించినా.. ఆ చట్టాన్ని తీసుకురావాల్సింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. ఆ సమయంలో నేను ఏం మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. "