Ghulam Nabi Azad on Kashmir Files: వివిధ అంశాల ఆధారంగా ప్రజలను కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు విభజిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, జీ23 గ్రూప్ సభ్యుడు గులాం నబీ ఆజాద్. 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణహోమాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లోయలో పండిట్లపై జరిగిన ఘటనలకు పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణమని పేర్కొన్నారు.
జమ్మూలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడారు ఆజాద్. సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
"కులం, మతం సహా ఇతర అంశాల ఆధారంగా 24x7 ప్రజలను విభజించటంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. నా సొంత పార్టీతో (కాంగ్రెస్) పాటు ఏ పార్టీని విస్మరించటం లేదు. ఈ విషయంలో వ్యక్తిగతంగా ఏ పార్టీని క్షమించను. పౌర సమాజం ఎప్పుడూ ఐక్యంగా ఉండాలి. కులం, మతం చూడకుండా అందరికి సమానంగా న్యాయం అందాలి. మహాత్మాగాంధీ అతిపెద్ద హిందువు, లౌకికవాది. జమ్ముకశ్మీర్లో 1990లో జరిగిన దానికి పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణం. దాని ద్వారా హిందువులు, ముస్లింలు, డోగ్రాలు, కశ్మీర్ పండిట్ వర్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. "