Ghulam Nabi Azad Article 370 : ఆర్టికల్ 370పై కొన్ని స్థానిక పార్టీలు జమ్ముకశ్మీర్ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఈ ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామంటూ హామీలు ఇస్తూ ప్రజల్ని మోసగిస్తున్నాయన్నారు. మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 తిరిగి పునరుద్ధరణ జరగదని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత తొలిసారి బారాముల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆజాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "ఓట్లు కోసం నేను ఎవరినీ పక్కదోవపట్టించను.. దోపిడీకి పాల్పడను. సాధించలేని సమస్యల జాబితాను పెంచుకోవద్దు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగదు. ఇది జరగాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. దేశంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలపడుతోంది. పార్లమెంట్‌లో మెజార్టీ సాధించి ఆర్టికల్ 370ని పునరుద్ధరించగలిగే పార్టీ ప్రస్తుతం దేశంలో ఏదీ లేదు" అన్నారు.
"ఇప్పటివరకు సాగిన దోపిడీ రాజకీయాలు కశ్మీర్‌లో లక్ష మందిని చంపడానికి దారితీశాయి. ఐదు లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. ఇది తీవ్ర వినాశనానికి కారణమైంది. నా రాజకీయ అవకాశాలు దెబ్బతిన్నప్పటికీ దోపిడీ, అసత్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకే జమ్ముకశ్మీర్‌కు వచ్చా. ప్రజల్నిరెచ్చగొట్టి ఆందోళనలకు పురిగొల్పడం మోసపూరితం. నా ప్రాణం ఉన్నంతవరకు అసత్యానికి వ్యతిరేకంగా పోరాడతా. ఈ ఆలోచన లేకుండా చేయాలనుకుంటే నన్ను చంపాల్సి ఉంటుంది. ఎన్నికల్లో సీట్లు గెలుచుకొనేందుకు భావోద్వేగ నినాదాలు ఇవ్వను. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్ తిరిగి రాష్ట్ర హోదా పొందేలా మనం పోరాడాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరంలేదు. రాష్ట్రంగా ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వమే జమ్ముకశ్మీర్ పౌరులకు ఉద్యోగాలు, భూముల భద్రతకు సంబంధించి చట్టాలు చేయవచ్చు. ఈ రెండు అంశాలకు పార్లమెంట్ ఆమోదం అవసరంలేదు" అని ప్రజలకు వివరించారు.
10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తా..:ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తాను ఏర్పాటుచేయబోయే కొత్త పార్టీ ఏర్పాటు అంశంపై ఆదివారం కీలక ప్రకటన చేశారు. మరో 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని వెల్లడించారు. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్‌లో మిలిటెంట్ కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అందరినీ ఉగ్రవాదులు టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.