Ghatam Instrument Player :ఓవైపు కుటుంబ వ్యవహారాలు చక్కబెడుతూనే తనకు ఇష్టమైన సంగీతంలో పట్టు సాధించి.. ఘటం వాయిద్యకారిణిగా రాణిస్తున్నారు సుకన్య రామగోపాల్. ఘటం కళాకారులంటే పురుషులే అన్న అభిప్రాయాన్ని చెరిపేస్తూ.. మహిళలేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సుకన్య.. పదేళ్ల వయసు నుంచే ఘటం వాయించడం ప్రారంభించారు. పురుషాధిక్యత ఉన్న ఈ రంగంలో రాణిస్తూ.. మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రఖ్యాత ఘటం కళాకారుడు విక్కూ వినాయక్రామ్ దగ్గర శిక్షణ తీసుకున్నారు సుకన్య. అయితే.. ఇదంతా సులభంగా ఏమీ జరిగిపోలేదు. సుకన్యలో ఘటం నేర్చుకోవడానికి కావాల్సిన లక్షణాలు ఉన్నాయో లేవోనని వినాయక్ రామ్ తొలుత అనుమానించారు. కానీ, సుకన్య నిబద్ధత చూసి మనసు మార్చుకున్నారు. ఘటం వాయించడంలో సుకన్య తప్పక రాణిస్తుందన్న నమ్మకం కలిగి.. ఆమెకు ఆ కళలో మెళకువలు నేర్పించారు. అప్పటి నుంచి అనేక కచేరీల్లో పాల్గొన్నారు సుకన్య. తాను ఘటం వాయించాడాన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేసేవారని చెబుతున్నారు.
"నాకు కచేరీలో పాల్గొనడం అంటే చాలా ఇష్టం, నా ముందు ప్రేక్షకులను చూడటం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కచేరి పూర్తి అయిన తర్వాత ప్రేక్షకులు అంతా నా దగ్గరికి వచ్చి.. ఒక మహిళ ఇలా లంగావోణీలో ఘటం వాయించడంమేము ఎప్పుడూ చూడలేదు, ఒక అమ్మాయి ఘటం వాయించడం చూస్తుంటే మాకెంతో కొత్తగా ఉంది అనేవారు. నిజానికి నా గురించి నాకు గర్వంగా ఉంది. నాకోసం నేను సరైన వాయిద్యాన్ని ఎంచుకోవటం చాలా సంతోషంగా ఉంది"
-సుకన్య రామగోపాల్, ఘటం వాయిద్యకారిణి
అనేక ప్రతిష్ఠాత్మక వేదికలపై తన కళను ప్రదర్శించారు సుకన్య. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లలో జరిగిన సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. ఈ అవకాశాలన్నీ తనకు గుర్తింపు తెచ్చిపెట్టడమే కాకుండా.. ఈ రంగంలో మాస్టర్‌గా ఎదగడానికి దోహదపడ్డాయని సుకన్య చెబుతున్నారు.
"నేను 1979లో ఆల్ ఇండియా రేడియోకు ఎంపికయ్యాను. 1980లో పెళ్లి అయ్యింది. తర్వాత బెంగళూరులో స్థిరపడ్డాం. దీంతో నేను నా ఎయిర్ స్టేషన్‌ను చెన్నై నుంచి బెంగళూరుకు మార్చుకున్నాను. ఆ సమయంలో నేను బీ గ్రేడ్ ఆర్టిస్ట్‌ను, ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్‌గా మారాను. మన సంప్రదాయాన్ని వేరే దేశాలకు తీసుకువెళ్లాలి. ప్రతీ చోట మన సంగీతానికి మంచి ఆహ్వానం దక్కుతుంది. ముఖ్యంగా కర్ణాటక సంగీతానికి ఎక్కువ ప్రాధన్యం ఉంది. వేదిక మీద ఒకే వాయిద్యంతో ప్రదర్శనలు ఇస్తే అప్పుడు విదేశీ ప్రేక్షకులు ఎంతో థ్రిల్ అవుతారు. ఘటం అయినా మరే ఇతర సంగీత వాయిద్యం అయినా ఆసక్తిగా తిలకిస్తారు. కొన్నిసార్లు డాన్స్ కూడా చేస్తారు."
-సుకన్య రామగోపాల్