రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు భారత్ సూచిస్తూనే ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఎలాంటి శాంతి చర్చలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఉక్రెయిన్ వివాదం మొదలైనప్పటి నుంచి దౌత్యం, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ నొక్కి చెబుతోందని మోదీ పేర్కొన్నారు. కొవిడ్, ఉక్రెయిన్- రష్యా యుద్ధ ప్రభావం యావత్ ప్రపంచం అనుభవించిందని అన్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. శనివారం దిల్లీకి చేరుకున్న ఆయనకు త్రివిధ దళాలు గౌరవ వందనం పలికాయి. అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోదీ, షోల్జ్ మాట్లాడారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ "ఉగ్రవాదం, వేర్పాటువాదంపై పోరులో భారత్, జర్మనీల మధ్య పరస్పర సహకారం ఉంది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు గట్టి చర్యలు అవసరమని ఇరు దేశాలు నమ్ముతున్నాయి. యూరప్‌లో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీ. అంతేకాకుండా భారత్‌లో పెట్టుబడులకు ముఖ్యమైన వనరు కూడా. అలాగే భారత్, జర్మనీ మధ్య బలమైన సంబంధాలు ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా భారత్, జర్మనీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'ప్రపంచం మొత్తం బాధపడుతోంది'
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కారణంగా ప్రపంచం మొత్తం బాధపడుతోందని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తెలిపారు. హింసతో దేశ సరిహద్దులను ఎవరూ మార్చలేరని ఆయన నొక్కి చెప్పారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం వల్ల అపారమైన నష్టం, విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. ఈ యుద్ధాన్ని ఒక విపత్తుగా అభివర్ణించారు.
"భారత్ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. అది భారత్, జర్మనీ మధ్య సంబంధాలకు చాలా మంచిది. రష్యా దురాక్రమణ పర్యవసానాలతో ప్రపంచం అల్లాడిపోతోంది. దాదాపు 1,800 జర్మన్ కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. అవి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాయి. మాకు ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు కావాలి. సాఫ్ట్‌వేర్ రంగం భారత్‌లో బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలు భారత్‌లో ఉన్నాయి."
-ఒలాఫ్ షోల్జ్, జర్మనీ ఛాన్సలర్
అంతకుముందు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో ఒలాఫ్ షోల్జ్‌ను ప్రధాని మోదీ కలిశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త టెక్నాలజీ, ఇంధనం, రక్షణ రంగాల్లో సంబంధాలను పెంపొందించడంపై చర్చలు జరిపారు. ఈ పర్యటనలో భాగంగా భారత్-జర్మనీల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా తెలిపారు. 2021 డిసెంబర్‌లో జర్మన్ ఛాన్సలర్ అయిన తర్వాత షోల్జ్ భారతదేశానికి రావడం ఇదే మొదటి సారి.
రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి నివాళి అర్పిస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ 2011లో ఇరుదేశాల మధ్య.. ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ మెకానిజం ప్రారంభమైన తర్వాత జర్మనీ ఛాన్సలర్ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. జర్మనీ ఛాన్సలర్‌తోపాటు ఉన్నతస్థాయి అధికారులతోపాటు పారిశ్రామికవేత్తల బృందం వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోనూ సమావేశం కానున్నారు.