Generic Medicine NMC Guidelines :చికిత్సలో భాగంగా రోగులకు కేవలం జనరిక్ ఔషధాలనే సూచించాలని నేషనల్ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది. అలా చేయని పక్షంలో సంబంధిత వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే కొంతకాలం పాటు ప్రాక్టీస్ చేయకుండా లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ల వృత్తిపరమైన ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలను ఎన్ఎమ్సీ జారీ చేసింది.
Nmc Generic Medicine 2023 :బ్రాండెడ్ జనరిక్ ఔషధాలను సైతం సూచించడం మానుకోవాలని కూడా వైద్యులకు సూచించింది ఎన్ఎమ్సీ. వైద్యులు జనరిక్ ఔషధాలు రాయాలనే నిబంధన ఉన్నప్పటికీ.. ఉల్లంఘిస్తే తీసుకోవాల్సిన చర్యలను 2002లో భారతీయ వైద్య మండలి-ఐఎమ్‌సీ జారీచేసిన నియమావళిలో ప్రస్తావించలేదు. బ్రాండెడ్ ఔషధాలతోపోల్చితే.. జనరిక్ ఔషధాలు 30 శాతం నుంచి 80 శాతం వరకు చౌకగా లభిస్తాయని.. వీటిని సూచిస్తే ఆరోగ్య సంరక్షణ భారాన్ని తగ్గిస్తాయని ఈనెల 2న ఎన్ఎమ్సీ నోటిఫై చేసిన నిబంధనల్లో పేర్కొంది. దాంతో పాటు నాణ్యమైన సంరక్షణను పొందేందుకు వీలు కలుగుతుందని తెలిపింది.
భారత పౌరుల్లో చాలా మంది తమ ఆదాయంలో ఎక్కువ భాగం ఔషధాలకే వెచ్చిస్తున్నారని ఎన్ఎమ్సీ అభిప్రాయపడింది. మందుల చీటీలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడాలని వైద్యులకు తెలిపింది ఎన్ఎమ్సీ. వీలైనంత వరకు ప్రిస్క్రిప్షన్లను టైపింగ్ లేదంటే ప్రింట్ రూపంలో ఇవ్వాలని పేర్కొంది. ప్రతీ ఆర్ఎమ్పీ డాక్టర్ అవసరమైన మందులనే రోగులను సూచించాలని తెలిపింది. దాంతో పాటు మార్కెట్ అందుబాటులో ఉన్న జనరిక్ మందులనే వారిని సూచించాలని వివరించింది. మెడికల్ షాప్, ఆస్పత్రులలో అవసరమైన జనరిక్ ఔషదాలు స్టాక్ ఉండేలా వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్ఎమ్సీ పేర్కొంది.
తాజా నిబంధనలు ఉల్లఘించిన వైద్యులకు తొలుత హెచ్చరికలు జారీచేస్తామని.. అవసరమైతే వర్క్ షాపులకు హాజరవ్వాల్సిందిగా కోరతామని ఎన్ఎమ్సీప్రకటించింది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడిన వైద్యుల లైసెన్స్.. కొంతకాలం సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. జన్ ఔషధి కేంద్రాలలో, జనరిక్ ఫార్మసీ షాప్‌లలో మందులు కొనేలా రోగులను పోత్సహించాలని వైద్యులకు ఎన్ఎమ్సీ సూచించింది. బ్రాండెడ్ మందులతో సరిసమానంగా జనరిక్ ఔషదాలు పనిచేస్తాయనే విషయాన్ని.. వైద్య విద్యార్థుల్లో, సాధారణ ప్రజల్లో తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించాలని ఎన్ఎమ్సీ తెలిపింది.