Gaurav Gandhi Heart Attack : 16వేల మందికి గుండె శస్త్రచికిత్సలు చేసి, మరెన్నో వేల మందికి మెరుగైన వైద్యం అందించిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ గౌరవ్ గాంధీ గుండెపోటుతో మరణించారు. మంగళవారం ఉదయం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
41 ఏళ్ల గౌరవ్ గాంధీ సోమవారం యధావిధిగా జామ్‌నగర్‌లోని తన ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందించారు. సాయంత్రం ప్యాలెస్ రోడ్‌లోని ఇంటికి వెళ్లారు. రాత్రికి భోజనం చేసి, నిద్రపోయారు. ఆ సమయంలో ఆయన ఇబ్బంది పడుతున్నట్లుగా ఎలాంటి సూచనలు కనిపించలేదు. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు డాక్టర్ గౌరవ్ గాంధీని నిద్రలేపేందుకు వెళ్లారు. అయితే ఆయన అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే గౌరవ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
గౌరవ్ గాంధీ జామ్‌నగర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత అహ్మదాబాద్‌లో కార్డియాలజీ కోర్సు చేశారు. స్వస్థలం జామ్‌నగర్‌కు తిరొచ్చి అక్కడే వైద్యునిగా సేవలు అందించడం ప్రారంభించారు. గుండె సంబంధిత సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తూ వేలాది మందిని కాపాడారు. జామ్‌నగర్ ప్రాంతంలో కార్డియాలజిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు.
హృద్రోగాలతో బాధపడే వారికి చికిత్స అందించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరంపై విస్తృత ప్రచారం చేసేవారు డాక్టర్ గౌరవ్ గాంధీ. ఫేస్బుక్లో హాల్ట్ హార్ట్ ఎటాక్ అనే పేరుతో ఈ అవగాహనా కార్యక్రమం చేపట్టేవారు. అనేక మంది ప్రాణాలు నిలబెట్టి, వృత్తిపరంగా ఎంతో పేరు సంపాదించుకున్న డాక్టర్ గౌరవ్ గాంధీ అకాల మరణంపట్ల సహచర వైద్యులు, ఆయన దగ్గర చికిత్స తీసుకున్న వారు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు.
గుండెపోటు రాకుండా ఉండాలంటే..
గుండె సంబంధిత సమస్యలు ఈ మధ్య సాధారణం అయ్యాయి. పిన్న వయసులోనే గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జీవనశైలిలోని మార్పులే ఇందుకు ప్రధాన కారణం అని వైద్యులు చెప్తున్నారు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రపోకపోవడం, దురలవాట్ల వల్ల అనేక మంది హృద్రోగాల బాధితులుగా మారుతున్నారు. గుండెపోటు రాకుండా చూసుకునేందుకు వైద్యులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. జీవనశైలిని కాస్త మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని అంటున్నారు. వాటిలో కొన్ని..