Gated Community Karnataka High Court : స్థానిక సంస్థలు అప్రూవల్ ఇచ్చిన గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న రోడ్లు, ఇతర సేవలపై వాటి యజమానులు లేదా లేఅవుట్ డెవలపర్లకు ఎటువంటి హక్కు ఉండదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. గేటెడ్ కమ్యూనిటీ అనే భావన లేదని.. సాధారణ ప్రజలను గేటెడ్ కమ్యూనిటీల్లోని రోడ్లను వినియోగించకుండా నిరోధించలేమని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం 2022 నవంబరు 29న ఇచ్చిన తీర్పును న్యాయస్థానం సమర్థించింది. లేఅవుట్లో నివసించని ప్రజలు కూడా.. అందులోని రోడ్లను వినియోగించడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
గేటెడ్ కమ్యూనిటీలోని రోడ్లపై ఎవరైనా వెళ్లొచ్చు.. వారికి మాత్రమే సొంతం కాదు: హైకోర్టు - గేటెడ్ కమ్యూనిటీపై కోర్టు తీర్పు
Gated Community Karnataka High Court : గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న రోడ్లు, ఇతర సేవలపై స్థానిక సంస్థల అప్రూవల్ అయిన తర్వాత యజమానులు లేదా లేఅవుట్ డెవలపర్స్‌కు ఎటువంటి హక్కు ఉండదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. గేటెడ్ కమ్యూనిటీతో సంబంధం లేని వారు ఆ రోడ్లపైకి రాకూడదన్న వాదనను తోసిపుచ్చింది.
By PTI
Published : Nov 30, 2023, 4:12 PM IST
బెంగళూరు ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలోని బెల్లందూర్‌లోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర టవర్స్‌కు చెందిన పబ్బారెడ్డి కోదండరామి రెడ్డికి వ్యతిరేకంగా ఉప్కార్ రెసిడెన్సెస్ కొంతకాలం క్రితం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. గేటెడ్ కమ్యూనిటీ(శ్రీలక్ష్మీ వెంకటేశ్వర టవర్స్)లో నివసించని వారు కూడా అందులోకి వెళ్లి, వచ్చేందుకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్‌పై ఏకసభ్య ధర్మానం విచారణ చేపట్టింది. అయితే.. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర టవర్స్ ఒక గేటెడ్ కమ్యూనిటీ అని.. అందులోని రోడ్లు నివాసితుల కోసమేనని కోదండరామి రెడ్డి కోర్టులో వాదించారు. అప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం.. గేటెడ్ కమ్యూనిటీ అనే భావన లేదని.. ప్రజలు అందులోని రోడ్లను వాడకుండా నిరోధించలేమని స్పష్టం చేసింది. ఈ తీర్పును కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు కోదండరామి రెడ్డి. ఈ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి. వరాలే, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.
'సంబంధిత గేటెడ్ కమ్యూనిటీల్లో రోడ్లను లేఅవుట్ నివాసితులు, ఇతరులు ఉపయోగించుకోవచ్చని గతంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై కలుగజేసేందుకు నిరాకరిస్తున్నాం. ఏకసభ్య ధర్మాసనం.. లేఅవుట్ ప్లాన్‌లో పొందుపరిచిన షరతు నెం-11కు లోబడే తీర్పు వెలువరించింది. లేఅవుట్ ప్లాన్‌లో షరతు నెం-11 ఉండడం వల్ల బయట వ్యక్తులు గేటెడ్ కమ్యూనిటీల్లోకి రాకుండా ఉండరాదనే అప్పీల్‌పై విచారణ జరపలేం.' అని పేర్కొంది. ఒకసారి స్థానిక సంస్థల అప్రూవల్ పూర్తైన తర్వాత గేటెట్ కమ్యూనిటీల్లో ఉన్న రోడ్లు, ఇతర సేవలపై యజమానులకు హక్కు ఉండదని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.