ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్ పోలీసులకు చిక్కాడు. అమెరికా కాలిఫోర్నియాలో ఉన్న అతడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాలిఫోర్నియా పోలీసులు మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. బ్రార్‌ను నవంబర్ 20కి ముందే అరెస్ట్ చేసి భారత ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఉన్న 2 కేసుల్లో అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. కెనడాకు పారిపోయిన గోల్డీ.. అనంతరం ఇద్దరు న్యాయవాదుల సహాయంతో అక్కడి నుంచి కాలిఫోర్నియాకు మకాం మార్చాడు.
'త్వరలోనే భారత్‌కు తీసుకువస్తాం'
మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్‌ను కచ్చితంగా భారత్‌కు తీసుకుస్తామని స్పష్టం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. కాలిఫోర్నియా పోలీసులు.. భారత ప్రభుత్వాన్ని, తమను సంప్రదించారని చెప్పారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. అతి త్వరలోనే బ్రార్‌ను తీసుకువస్తామన్నారు మాన్.
లూథియానా పేలుళ్ల సూత్రధారి అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, పంజాబ్ లూధియానా కోర్టు పేలుళ్ల కేసు నిందితుడు హర్‌ప్రీత్ సింగ్‌ను అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). మలేసియా నుంచి వచ్చిన అతడిని దిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ శుక్రవారం వెల్లడించింది.