ఉత్తర్‌ప్రదేశ్ ఫరూఖాబాద్‌లో దారుణం జరిగింది. నిండు గర్భిణీపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫరూఖాబాద్ బస్టాండ్ సమీపంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖాబాద్ బస్టాండ్ సమీపంలో ఉన్న గర్భిణీని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను ఓ గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజులపాటు నిందితుల చేతిలో చిత్రహింసలు అనుభవించిన బాధితురాలు వారి నుంచి తప్పించుకుని.. 12 కిలోమీటర్లు నడిచి ఓ గ్రామానికి చేరుకుంది. గ్రామస్థులకు తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
"ఆగస్టు 16న బరేలీ నుంచి బస్సులో బయలుదేరి ఫరూఖాబాద్ వచ్చాను. సాయంత్రం 6 గంటల సమయంలో నలుగురు యువకులు నా దగ్గరకు వచ్చి బలవంతంగా లాక్కెళ్లిపోయారు. ఓ గదిలో బంధించి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. స్పృహ తప్పి పడిపోయా. నేను గర్భవతిని నన్ను వదిలేయండి అని ప్రాధేయపడినా కనికరించలేదు. నిందితులు నిద్రపోతుండగా వారి నుంచి తప్పించుకున్నా. 12 కిలోమీటర్లు నడిచి గ్రామస్థులకు జరిగిందంతా చెప్పా. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశా"