సామూహిక అత్యాచార బాధితురాలి (Gang rape victim Delhi) భర్తను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు. ఈశాన్య దిల్లీలోని దయాల్పుర్ పోలీస్ స్టేషన్ (Dayalpur Police Station) పరిధిలో ఈ ఘటన జరిగింది.
కాల్పులు జరిపి పరార్..
చౌహాన్ బాగ్ ప్రాంతంలో అత్యాచార బాధిత మహిళ.. తన భర్త, చిన్నారితో కలిసి నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి 12.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఇంటి వద్దకు వచ్చి తలుపు కొట్టారు. భర్త వెళ్లి తలుపు తెరవగానే.. దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. పొరుగునే ఉంటున్న బంధువులకు సమాచారం అందించి.. తన భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆ మహిళ. అయితే అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తేల్చారు.
గాజియాబాద్లోని అంకుర్ నగర్లో నివసించే మనీశ్ పవన్ పండిత్, 'టాటూ' అని పిలిచే మరో వ్యక్తితో కలిసి తన భర్తను హత్య చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహిళ ఆరోపించారు.