gangrape in Aligarh: ఆటోలో వెళ్తున్న మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. బాధితురాలు(35) దిల్లీ నుంచి అలీగఢ్‌లోని తన అత్తమామల ఇంటికి బయలుదేరి వెళ్లింది. ఈ క్రమంలో అలీగఢ్ బస్టాండ్ నుంచి అక్రాబాద్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లే ఆటోను ఎక్కింది. ఆటోలో బాధితురాలితోపాటు మరో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ తరువాత ఆటో డ్రైవర్.. మరో ఇద్దరు ప్రయాణికులతో కలిసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితులందరూ ఘటనా స్థలం నుంచి పరారయ్యారు.
ఆటో డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు అక్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నుంచి రూ. 20,000 నగదు, మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను వైద్య పరీక్షలు నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు తొమ్మిదో తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా మాట్లాడినందుకు పాఠశాల ప్రిన్సిపల్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రెవాలోని మార్తాండ్ పాఠశాలలో జరిగింది. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ నిజ నిర్ధరణ కమిటీ వేసింది. అప్పుడు విద్యార్థినిని ప్రిన్సిపల్ అమరేశ్ సింగ్ వేధించడం నిజమేనని తెలింది. దీంతో జిల్లా విద్యాశాఖ.. నిందితునికి సస్పెన్షన్ నోటీసులు అందజేయగా.. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.