ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలో దారుణం జరిగింది. 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. శనివారం జరిగిందీ ఘటన. నిందితులుపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయం రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ దృష్టికి చేరడం వల్ల తక్షణమే నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విభూతిఖండ్ పోలీసులను ఆదేశించారు. నిందితులను ఆకాశ్, ఇమ్రాన్లుగా గుర్తించారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు కథౌటా ప్రాంతంలోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటోలో డ్రైవర్ కాకుండా మరో వ్యక్తి ఉన్నాడు. హుస్దియా కూడలి సమీపంలోకి రాగానే డ్రైవర్ వేరే రూట్లో ఆటోను నడిపాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన బాధితురాలు కేకలు వేసింది. దీంతో ఆటో డ్రైవర్ ఆమె తిట్టాడు. బాధితురాలు మళ్లీ అరిచేసరికి.. ఆమె తలపై దాడి చేశారు ఇద్దరు నిందితులు. అనంతరం బాధితురాలు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.
నిందితులిద్దరూ బాధితురాల్ని ఆటోలో సుశాంత్ గోల్ఫ్ సిటీలోని ప్లాసియో మాల్ దగ్గర పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆమెపై 3 గంటల పాటు అత్యాచారం చేసి.. తీవ్రంగా గాయపరిచారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పింది. అనంతరం ఇంటికి చేరుకుంది. 'బాధితురాలి.. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకే ఆమె ట్యూషన్లు చెబుతూ తన పాఠశాల ఫీజులు కడుతోంది. విభూతిఖండ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదుకు నిరాకరించారు' అని బాధితురాలి బంధువులు తెలిపారు.