Ranchi Rape Case: ఝార్ఖండ్ రాంచీలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కిరాతకులు. ఆమెకు ఫోన్ చేసి ఏకాంత ప్రదేశానికి రమ్మని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. చాహ్నో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అత్యాచారం జరిగిందని సమాచారం అందిన గంటల్లోనే వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
పిల్లలను బావిలోకి విసిరిన తండ్రి: ఉత్తర్‌ప్రదేశ్ జౌన్‌పుర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ తండ్రి అత్యంత క్రూరంగా ప్రవర్తించి తన ఇద్దరు బిడ్డలను బావిలోకి విసిరేశాడు. దీంతో వారు చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం నైపురా గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. చనిపోయిన ఇద్దరిలో ఒకరు ఏడేళ్ల పాప కాగా.. మరొకరు ఐదేళ్ల బాలుడు. తండ్రి మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే ఈ దారుణ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రమే అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.