ఉత్తర్‌ప్రదేశ్‌లోని జనపథ్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 13 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేశారు. మరొక్కరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే... జనపథ్‌లోని కడీపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిదవ తరగతి చదువుకుంటున్న ఓ బాలిక మంగళవారం సాయంత్రం ట్యూషన్ నుంచి తిరిగి వస్తోంది. దారి మధ్యలో ఉన్న నిశబ్ద ప్రాంతాన్ని అదునుగా చేసుకుని ముగ్గురు వ్యక్తులు బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చెర నుంచి మరో నిందితుడు తప్పించుకున్నాడు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేస్తామని పరారైన నిండితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
జబల్పుర్లో ఆగని దుశ్చర్యలు
మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో మహిళలపై దుశ్చర్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. స్థానిక మహిళతో పాటు ఓ యువతిపై కొంత మంది దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. కోపోద్రిక్తులైన ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది ఒక వర్గానికి చెందిన వారి చర్య అని ఆరోపించిన నిరసనకారులు, నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది:
మంగళవారం రాత్రి సుమారు 12:30 సమయంలో ఓ తల్లీకూతుళ్లు దుర్గామాత ప్రతిమలు చూసేందుకు బయటకు వచ్చారు. దర్శనం చేసుకుంటున్న సమయంలో వారిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ పోసి అక్కడ నుంచి పరారయ్యారు. శబ్దం రావడంతో అక్కడే ఉన్న దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు వెంటనే వచ్చి పారిపోతున్న నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు.
ఘటన గురించి తెలిసిన వెంటనే భాజపా నాయకులతో పాటు హిందూ సంస్థల అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసే విషయంలో పోలీస్ స్టేషన్లో వాగ్వాదం చోటు చేసుకుంది. హిందూ సంస్థల డిమాండ్‌తో పాటు స్థానికుల నిరసనలతో పోలీసులు కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తల్లీకూతుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.