Gang rape: 11వ తరగతి విద్యార్థినిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె చదువుతోన్న పాఠశాలలోని ఓ టీచర్. ఆపై మరో ఇద్దరికి అప్పగించాడు. ఆ తర్వాత బాలికను టాయిలెట్లో బంధించాడు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది..
ఈనెల 6న మధ్యాహ్నం విద్యార్థిని పొరిగింటి వారి తోటకు పనికి వెళ్లింది. కానీ, సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి చుట్టు పక్కల వెతికారు. శుక్రవారం ఉదయం టీచర్ ఇంటిలోంచి బాలిక అరుపులు విన్న ఓ వ్యక్తి.. బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వెంటనే కొందరు గ్రామస్థులతో కలిసి అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. ఉపాధ్యాయుడి ఇంట్లోని ముత్రశాలలో బంధించి ఉన్న బాలికను కాపాడారు.
ఆ తర్వాత.. తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది బాధితురాలు. గురువారం మధ్యాహ్నం ఒకడు తనను వాహనంలో ఎత్తుకొచ్చాడని తెలిపింది. టీచర్ ఇంటికి తీసుకొచ్చి ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారని చెప్పింది.
జోధ్‌పుర్‌కు సమీపంలోని ఒసైన్ ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు.. మూడేళ్లుగా విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్నాడని, విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా మరో ఇద్దరికి అప్పగించాడని మతోరా పోలీసులు తెలిపారు. 'బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు.. ఉపాధ్యాయుడు సహా మరో ఇద్దరిపై అపహరణ, అత్యాచారం కేసులు నమోదు చేశాం. టీచర్ని అరెస్ట్ చేశాం. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టాం. 'అని తెలిపారు.