Tamilnadu Gang rape case: ఓ యువతిని ప్రేమ పేరుతో మోసగించి, బ్లాక్ మెయిల్ చేస్తూ కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘటన తమిళనాడులోని విరుధునగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. అరెస్ట్ అయిన వారిలో నలుగురు మైనర్లేనని, ఇద్దరు డీఎంకే కార్యకర్తలని పోలీసులు చెప్పారు.
ఇదీ జరిగింది: విరుధునగర్‌లోని మేల్ వీధికి చెందిన హరిహరన్(27) అనే వ్యక్తి నగరంలోని ఓ దళిత యువతిని ప్రేమ పేరుతో మోసగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆ దుశ్చర్యను వీడియో తీశాడు. దానిని తన స్నేహితులకు పంపించాడు. ఆ వీడియోను చూపిస్తూ బాలికను బ్లాక్ మెయిల్ చేసి కొన్ని నెలల పాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు అతని స్నేహితులు. అందులో నలుగురు మైనర్లు ఉన్నారు. వారి హింసను భరించలేని బాధితురాలు మార్చి 20న పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు విరుధునగర్ గ్రామీణ పోలీసులు. నలుగురు మైనర్లు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
రాజకీయ దుమారం:ఈ ఘటనపై రాజకీయంగా దుమారం చెలరేగింది. ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. 'విరుధునగర్‌లో 22 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుల్లో నలుగురిని కేసు నమోదైన 24 గంటల్లోనే పట్టుకున్నాం. వారిని జువనైల్ హోమ్‌కు తరలించాం. ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేశాం. ఈ కేసులో సీబీసీఐడీ సూపరింటెండెంట్ ముథరాసిని ప్రత్యేక అధికారిగా నియమించాం. 60 రోజుల్లో అభియోగ పత్రం దాఖలు చేస్తాం. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రత్యేక కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని డీజీపీకి సూచించా. ఇలాంటి నేరాలు చేస్తే తక్షణం చర్యలు ఉంటాయనేందుకు ఈ కేసు ఉదాహరణ. నిందితులకు ఓ గుణపాఠం.' అని పేర్కొన్నారు.