తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కత్తితో బెదిరించి యువతిపై లైంగిక దాడి.. ప్రియుడి చేతిలో వివాహిత దారుణ హత్య - ఝార్ఖండ్​లో వివాహితను చంపిన ప్రేమికుడు

ఓ యువతిని కిడ్నాప్​ చేసిన ఇద్దరు దుండగులు.. ఆమెను కత్తితో బెదిరించారు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా, నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. మరోవైపు, ప్రియుడి చేతిలో ఓ వివాహిత హత్యకు గురైంది. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

Gang rape at knifepoint
Gang rape at knifepoint

By

Published : Jan 16, 2023, 11:21 AM IST

ఓ యువతిని కిడ్నాప్​ చేసి.. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను పోలీసులు కాల్చారు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఓ యువతి కాంచీపురం జిల్లాలో నివసిస్తోంది. జనవరి 11న ఆమె తన ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు దుండగులు వెంబడించారు. ద్విచక్ర వాహనంపై యువతి వద్దకు వచ్చి పోలీసులమని నమ్మించారు. అనంతరం ఆమెను బైక్​పై ఎక్కించుకుని కొద్ది దూరం తీసుకెళ్లారు. కాసేపటికి వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి.. యువతి గట్టిగా అరిచింది. దీంతో ఆమెను కత్తితో బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు.

బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్​లను పరిశీలించారు. అనంతరం ప్రకాశ్​(30), నాగరాజు (31) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్టు చేస్తున్న సమయంలో నిందితుడు నాగరాజు బైకులో ఉన్న గన్​ను తీసి పోలీసులను కాల్చడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు తిరిగి కాల్పులు జరపగా నిందితుడు గాయపడ్డాడు. దీంతో అతడిని కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి చైన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. నిందితులు వాడిన బైక్​ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రేమికుడి చేతిలో వివాహిత హత్య..
ఝార్ఖండ్​లో దారుణం జరిగింది. ప్రియుడి చేతిలో ఓ వివాహిత హత్యకు గురైంది. ఈ ఘటన రామ్​గఢ్​ జిల్లాలో శనివారం జరిగింది.
ఇదీ జరిగింది.. మృతురాలు మమతా దేవి.. ఆమె అక్క జయ, బావ నిఖిల్​ కుష్వాలాతో బార్కాకానా అనే ప్రాంతంలో ఉంటోంది. జనవరి 14న జయ, నిఖిల్​ బయటకు వెళ్లారు. షాపింగ్​ అనంతరం ఇంటికి తిరిగి వచ్చేసరికి మమత ముఖంపై గాయంతో రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తలించారు. అప్పటికే మమత చనిపోయిందని ధ్రువీకరించారు. కాగా, తన సోదరి మృతికి అర్మాన్​ ఖాన్​ కారణమని జయ చెప్పింది. 'వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మమతను తనతో రావాలని అర్మాన్​ ఒత్తిడి తెచ్చేవాడు. పలుమార్లు బెదిరించాడు కూడా. ఇప్పుడు మమత చంపి పారిపోయాడు' అని ఆరోపించింది.

కాగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే హత్యకు గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్​లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాతకక్షలతో ముగ్గురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన భింద్​ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..పచేరా అనే గ్రామంలో ఇటీవలే సర్పంచ్​ ఎన్నికలు జరిగాయి. మృతులు హకిమ్, గోలు, పింకు అనే ముగ్గురు అభ్యర్థులు.. మాజీ సర్పంచ్​ నిషాంత్​ త్యాగిని ఓడగొట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య వైరం తలెత్తింది. ముగ్గురు వాళ్ల పొలాలకు వెళ్తుండగా.. నిషాంత్​ కుటుంబ సభ్యులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. కాసేపటికే మృతిచెందారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ.. దర్యాప్తు ప్రాంరభించామని తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details