హిందూ ముస్లింలు కలసికట్టుగా చేసిన సిపాయిల తిరుగుబాటు (1857) తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. అదే విభజించు పాలించు సూత్రం! తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి భారతీయులను ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా విభజించటం మొదలెట్టింది. హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టింది. మళ్లీ హిందువుల్లో కులాల మధ్య; ముస్లింలలోనూ షియా-సున్నీల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య... ఎలా వీలైతే అలా విభజించి విద్వేషాల చిచ్చు రాజేసి, స్వరాజ్యం కోసం ఆలోచించకుండా తమలోతాము కొట్టుకునేట్లు చేసింది. వీటన్నింటికి తోడు రాజకీయ, మతపరమైన సమావేశాలు, భారీ సభలు, ప్రజలు గుంపులుగుంపులుగా ఒకచోట చేరటంలాంటి వాటిని నిషేధించింది. అలాంటి నిర్బంధ, నిర్వేద పరిస్థితుల్లో భారతీయులకు 'స్వాతంత్య్రం' అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు గణేశుడు!(Ganesh Festival)
ఏకం చేయటానికి వేదికగా..
1890ల నాటికే కాంగ్రెస్‌లోని అతివాదుల్లో ఒకరిగా, జాతీయోద్యమ కీలక నేతగా ఎదిగిన బాలగంగాధర్ తిలక్ తెల్లవారి ఎత్తుకు పైఎత్తు వేశారు. వినాయక చవితిని జాతీయోద్యమానికి ముడిపెట్టారు. ప్రజలందరినీ కులమతాలకు అతీతంగా ఏకం చేయటానికి చవితి వేడుకలను వేదికగా మలిచారు. అప్పటిదాకా ఇళ్లకే పరిమితమైన గణేశుడి పూజను వీధుల్లో మండపాలకు విస్తరించారు. 1894లో తొలిసారిగా పుణెలో సార్వజనిక్ గణేశ్ ఉత్సవ్(Ganesh Chaturthi) పేరిట మండపాల్లో మట్టి వినాయకులను ప్రతిష్ఠించి నవరాత్రులూ ఉంచి... ఆ తర్వాత నిమజ్జనం చేసే సంప్రదాయం మొదలైంది. గుడుల్లో కన్పించే అంటరానితనం కూడా ఈ మండపాల కారణంగా కనుమరుగవటం ఆరంభమైంది. వివిధ వీధుల్లో మండపాల ఏర్పాటుతో అన్ని కులాలు, వర్గాల ప్రజలు వీటిలో ఉత్సాహంగా పాల్గొనటానికి అవకాశం దొరికింది. ఈ నవరాత్రులూ ప్రజలు వేల సంఖ్యలో మండపాలకు వచ్చేవారు. భజనలు, కీర్తనలతో పాటు జాతీయోద్యమానికి సంబంధించిన పాటలు, ఉపన్యాసాలు కూడా ఈ నవరాత్రుల్లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు తిలక్!(Bal Gangadhar Tilak) జాతీయోద్యమ నాయకులకు కూడా ప్రజల్ని చైతన్య వంతులను చేయటానికి ఈ మండపాలు మంచి వేదికగా నిలిచాయి. తరువాతి సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలు ముంబయికి... ఆనక యావత్ భారతావనికి పాకాయి.
సరికొత్త స్వాతంత్య్రపు రుచి...
నవరాత్రుల్లో సాగే నాయకుల ఉపన్యాసాలు, పాటలు, కీర్తనల ద్వారా జాతీయోద్యమ చైతన్యం వెల్లివిరియటమేగాకుండా... స్వేచ్ఛ, స్వాతంత్య్రాలంటే ఎలా ఉంటాయో కూడా ప్రజలకు అర్థమైంది. అప్పటిదాకా అనేక నిబంధనల మధ్య నలుగుతూ, నలుగురు కలసి మాట్లాడుకోలేని పరిస్థితుల్లోంచి... వేలమంది ఒకే చోట గుమిగూడటం... స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించుకోవటం, ఇష్టం వచ్చినట్లు కార్యక్రమాల్లో పాల్గొనటం, కులాలకు అతీతంగా ఆనందంగా అంతా కలసి మెలసి పోవటం... అనేవి ప్రజలకు గణేశ్ ఉత్సవాల(Ganesh Celebration) రూపంలో సరికొత్త స్వాతంత్య్రపు రుచిని చూపాయి.