తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: గాంధీ కోరిన దీపావళి వెలుగులివీ.. - జాతీయోద్యమం

భారత స్వాతంత్య్రోద్యమంలో పండగలు ప్రముఖ పాత్ర పోషించాయి. ప్రజల్లో స్ఫూర్తి రగిల్చేందుకు ఆ పర్విదనాలను ఉపయోగించేవారు నేతలు. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత దీపావళి పండగను(diwali celebration) జరుపుకోవటంపై తనదైనశైలీలో ప్రజల్లో స్ఫూర్తి నింపారు మహాత్మ గాంధీ(Mahatma Gandhi). ఆనాటి గాంధీజీ మాటలను ఓసారి గుర్తు చేసుకుందాం.

gandhiji
గాంధీ కోరిన వెలుగులివీ

By

Published : Nov 4, 2021, 7:04 AM IST

జాతీయోద్యమంలో పండగలు పబ్బాలు కూడా స్వాతంత్య్ర సాధనకు వేదికలయ్యేవి. ఆ పర్వదినాల్లోనూ ప్రజల్లో స్ఫూర్తి రగిల్చేందుకు ప్రయత్నించేవారు నేతలు! ఈ క్రమంలో దీపావళి సంబరాలపై(diwali celebration) స్వాతంత్య్రం రాకముందు... వచ్చాక గాంధీజీ(Mahatma Gandhi) ఏమన్నారో ఒకసారి చూస్తే...

స్వాతంత్య్రానికి ముందు...

దీపావళిని సంబరంగా(Diwali celebrations) జరుపుకోవటమంటే రామరాజ్యంలో జీవిస్తున్నామన్నట్లే! కానీ మనం నిజంగా అలాంటి రాజ్యంలో ఉన్నామా? లేము. స్వరాజ్యం వస్తేనే రామరాజ్యానికి దారి! మనకిప్పుడు తాగటానికి పాలులేవు. తినటానికి తిండి లేదు. ధరించడానికి దుస్తుల్లేవు. ప్రజల్ని అకారణంగా ఊచకోత కోసే.. ప్రజల మధ్య చిచ్చుపెట్టేవారి పాలనలో దీపావళిని సంబరంగా ఎలా చేసుకోగలం? తొలుత ఆ నరకాసురుడిని గుర్తించి దూరంగా ఉంటూ, సహాయ నిరాకరణ చేయాలి. ఇందుకు ఎంతో ధైర్యం కావాలి. ఈ ధైర్యాన్ని ప్రదర్శించాలంటే మన సంబరాలను, సౌకర్యాలను వదులుకోవాలి. ఆ పాలకులిచ్చే తాయిలాలకు దూరంగా ఉండాలి. ఆటపాటలు, మిఠాయిలు, బాణసంచాపై ఖర్చు చేయకుండా... దాచుకున్న సొమ్మును 'స్వరాజ్య' సాధనకు దానం చేయాలి. మనదైన ప్రభుత్వం వచ్చాక దీపావళి సంబరాలు చేసుకుందాం. స్వరాజ్యం సాధించిననాడే నిజమైన దీపావళి. అప్పుడు మన రామసేన (అహింస, సత్యం) రావణ సైన్యం (హింస, అసత్యం)పై గెల్చిన సంబరాల్ని ఘనంగా జరుపుకొందాం.

మహాత్మా గాంధీ

స్వాతంత్య్రానంతరం తొలి దీపావళి (1947 నవంబరు 12) రోజున...

నేడు భారత్‌లో స్వరాజ్యం వచ్చిందిగానీ రామరాజ్యం రాలేదు. మరి మనమెలా దీపావళి సంబరంగా చేసుకోగలం? దీపావళిని తేజోమయంగా ఎలా చేసుకోగలమో అంతా ఒకసారి అర్థం చేసుకోవాలి. మన హృదయంలో దేవుడు వెలిగించేదే అసలైన వెలుగు. బయట కనిపించే కృత్రిమమైనవి కావు. మనందరి హృదయాల్లో ప్రేమజ్యోతి వెలుగులీనాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరం మన హృదయంలో ఆ జ్యోతిని ప్రజ్వలింపజేయాలి. అప్పుడే పండగ శుభాకాంక్షలకు మనం అర్హులం. లక్షలమంది ప్రజలు సంక్షోభంలో ఉన్నారు. హిందు, ముస్లిం, సిక్కు... బాధితులు ఎవరైనా కావొచ్చు! దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పాలంటే మనసుల్లోంచి విద్వేషాన్ని, అనుమానాన్ని తొలగించుకోవటం ప్రతి ఒక్కరి కర్తవ్యం. మనలోని దైవత్వాన్ని గుర్తించకుంటే... చిన్నచిన్న అంతర్గత సంఘర్షణలను విస్మరించకుంటే... కశ్మీర్‌లో, జునాగఢ్‌లో సాధించిన విజయం పనికిరాకుండా పోతుంది. భయంతో పారిపోయిన ముస్లింలను తిరిగి తీసుకొచ్చేదాకా దీపావళిని సంబరంగా చేసుకోలేం. తమ నుంచి భయంతో పారిపోయిన హిందువులు, సిక్కులను వెనక్కి తెప్పించుకోకుంటే పాకిస్థాన్‌ కూడా మనుగడ సాగించలేదు. కేవలం భారత్‌లోని వారికే కాకుండా, ప్రపంచంలోని మానవాళికి సేవ చేసేలా మీ అందరి హృదయాలను వికసింపజేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

ఇదీ చూడండి:దీపాల కాంతుల్లో మురిసిన అయోధ్య- మెరిసిన 'సరయూ'

ABOUT THE AUTHOR

...view details