Gandhi Peace Prize Venkaiah Naidu : ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి బహుమతి జ్యూరీలో నామినేటెడ్ సభ్యునిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నియామకానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 1995లో గాంధీజీ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతి పేరుతో అవార్డును ఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద కోటి రూపాయల నగదుతో పాటు, ప్రశంసా పత్రం, చేనేత వస్తువును అందజేస్తారు. ప్రధాన మంత్రి ఈ జ్యూరీకి అధ్యక్షుత వహిస్తారు. 'ప్రధాని మంత్రి మిమ్మల్ని నామినేటెడ్ సభ్యునిగా నియమించారనే విషయాన్ని తెలియజేయడం నాకు గౌరవంతో పాటు ఆనందాన్ని కలిగిస్తోంది' అని వెంకయ్య నాయుడుకి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా వ్యవహరించారు. రాజ్యసభకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. జాతీయ రాజకీయాల్లోకి రాకముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978 నుంచి 2017 వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. అన్ని భాషల్లో అంత్యప్రాసలతో ఆయన చేసే ప్రసంగం పండితుల నుంచి పామరుల వరకు అందర్నీ అలరిస్తుంది. దక్షిణాదిలో వాజ్‌పేయీ ప్రసంగాలను తెలుగులోకి తర్జుమా చేసేవారు. వాజ్‌పేయీ, ఆడ్వాణీలను వికాస్ పురుష్, లోహ్ పురుష్‌లుగా అభివర్ణించి వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఒకప్పుడు ఆడ్వాణీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఆయన 2014 ఎన్నికలకు ముందు మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బలంగా సమర్థించారు. ఆ తర్వాత ఆయన హయాంలో పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు.