తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Gandhi Peace Prize : వందేళ్ల సంస్థకు గాంధీ శాంతి పురస్కారం.. మోదీ నేతృత్వంలోని జ్యూరీ ప్రకటన

Gandhi Peace Prize : జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏడాదికి గాను గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత గీతాప్రెస్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.

gandhi-peace-prize-2021-for-geeta-press-gorakhpur-govt-announced
గీతా ప్రెస్‌కి 2021 గాంధీ శాంతి పురస్కారం

By

Published : Jun 18, 2023, 8:35 PM IST

Gandhi Peace Prize : 2021 ఏడాదికి గాను గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏటా అందజేసే ఈ అవార్డ్​కు.. ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్‌పూర్‌ చెందిన ప్రఖ్యాత గీతాప్రెస్​ను ఎంపిక చేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష కృషికి గుర్తింపుగా.. గీతాప్రెస్‌ ప్రచురణ సంస్థను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని జ్యూరీ.. పురస్కారానికి గీతా ప్రెస్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు కేంద్రం వెల్లడించింది. శాంతి, సామాజిక సామరస్యత అనే గాంధీజీ ఆశయాలను ప్రచారం చేయడంలో గీతాప్రెస్‌ ఎంతో కృషి చేసిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా గీతాప్రెస్‌ను ప్రధాని గుర్తు చేసుకున్నట్టు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. గీతాప్రెస్‌ స్థాపించి వందేళ్లు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో గాంధీ శాంతి పురస్కారానికి ఎంపిక కావడం సామాజిక సేవలో ఆ సంస్థ కృషికి దక్కిన గొప్ప గుర్తింపని తెలిపింది. 1923లో ప్రారంభమైన గీతాప్రెస్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. పద్నాలుగు భాషల్లో 41.7 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించి ఈ సంస్థ రికార్డు నెలకొల్పింది. వీటిల్లో దాదాపు 16.21 కోట్లు.. శ్రీమద్‌ భగవద్గీత పుస్తకాలే కావటం విశేషం.

1995లో మహాత్మా గాంధీ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా.. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. దేశం, జాతి, భాష, కులం, మతం, లింగ భేదం.. ఇలా ఎలాంటి అవధులు లేకుండా గాంధీజీ బాటలో శాంతియుత మార్గంలో నవ ప్రపంచ నిర్మాణానికి కృషిచేసిన గొప్ప వ్యక్తులు, సంస్థలకు ప్రతి సంవత్సరం ఈ ప్రైజ్‌ను అందజేస్తోంది ప్రభుత్వం. ఈ అవార్డు కింద రూ. 1 కోటి, ఓ ప్రశంసా పత్రం, జ్ఞాపిక, సాంప్రదాయ హస్తకళ/చేనేత వస్తువును అందిస్తారు.

గత అవార్డు గ్రహీతలలో ఇస్రో, రామకృష్ణ మిషన్, గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్, వివేకానంద కేంద్రం, కన్యాకుమారి, అక్షయ పాత్ర, బెంగళూరు, ఏకల్ అభియాన్ ట్రస్ట్ మిగతా కొన్ని సంస్థలు ఉన్నాయి. 2020, 2019 సంవత్సరాలకు కలిపి.. ఒకేసారి గతేడాది మార్చిలో గాంధీ శాంతి పురస్కారాలను ప్రకటించిన ప్రభుత్వం. 2020 ఏడాదికి గాను బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు దివంగత షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ను ఈ పురస్కారం వరించింది. 2019 ఏడాదికి గాను ఒమన్‌ సుల్తాన్‌ దివంగత ఖబూస్‌ బిన్‌ సైద్‌కు పురస్కారాలు ప్రకటించింది ప్రభుత్వం.

ABOUT THE AUTHOR

...view details