ఉక్కు పిడికిలితో ఇటలీని పాలించిన బెనిటో ముసోలిని పేరు చెబితేనే ఆంగ్లేయులకు కంపరం పుట్టేది. తమకు పక్కలో బల్లెంలా మారిన ఫాసిస్టు నియంతను కలవటానికి.. అహింసకు మారుపేరైన గాంధీజీ వెళ్లటం (Gandhi meets mussolini) తెల్లవారిని ఆశ్చర్యపరచింది. నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో కలకలం సృష్టించింది.
- 1931లో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనటానికి లండన్ వెళ్లిన మహాత్మాగాంధీ.. తిరిగి వచ్చే క్రమంలో ఇటలీలో ఓడ ఎక్కాల్సివచ్చింది.
- 1931 డిసెంబరు 12న రోమ్‌లో అడుగుపెట్టారాయన. వాటికన్‌లో పోప్‌ను కలవాలనుకున్నారు. ఆ రోజు ఆదివారం కావటంతో వివిధ కార్యక్రమాల్లో పోప్ తీరికలేకుండా ఉన్నారు. ఫలితంగా వారి భేటీ జరగలేదు. ఇంతలో సాయంత్రం 6 గంటలకు ప్రధాని ముసోలిని గాంధీజీని కలవాలనుకుంటున్నారని సమాచారం వచ్చింది. తన కార్యదర్శి మహదేవ్ దేశాయ్, శిష్యురాలు మీరాబెన్ వెంటరాగా ముసోలినిని కలవటానికి వెళ్లారు గాంధీజీ. పిచ్చాపాటీ అయ్యాక ముసోలిని నేరుగా భారత విషయాల్లోకి వచ్చారు.
ముసోలిని: రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏమైనా కచ్చితమైన ఫలితం ఉంటుందనుకుంటున్నారా?
గాంధీ: లేదు. అలాంటి ఫలితాన్ని నేను ఆశించలేదు కూడా!
ముసోలిని: భారత ఆర్థికస్థితి ఎలా ఉంది?
గాంధీ: దారుణంగా ఉంది. రోజువారీ దోపిడీ కొనసాగుతోంది. చాలా మేరకు సైన్యం నిర్వహణకే వెచ్చిస్తున్నారు.
ముసోలిని: మీ తదుపరి ప్రణాళిక ఏంటి?
గాంధీ: సహాయ నిరాకరణ మొదలు పెట్టాలనుకుంటున్నాం.
ముసోలిని: మరి హిందూ-ముస్లింల సంగతేంటి?
గాంధీ: కచ్చితంగా ఓ పరిష్కారం కనుగొంటాం. మా కాంగ్రెస్‌లో చాలామంది ముస్లిం నేతలున్నారు.
ముసోలిని: హిందూ-ముస్లిం ఐక్యత సాధించగలనని మీరనుకుంటున్నారా?
గాంధీ: తప్పకుండా. ఈ విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదు.
ముసోలిని: భారత్‌లో ప్రజాస్వామ్యం కావాలనుకుంటున్నారా?
గాంధీ: అవును. మేం ప్రజాస్వామ్య పాలననే కోరుకుంటున్నాం.
ముసోలిని: ఒకే వ్యక్తి దేశమంతటినీ పాలించే అవకాశం గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
గాంధీ: లేదు. మా పాలనలో అందరికీ భాగస్వామ్యం ఉండాల్సిందే.
ముసోలిని: భారత్‌లో కమ్యూనిజం విజయవంతం అవుతుందా?
గాంధీ: లేదు. నాకైతే అలా అనిపించటం లేదు.
ముసోలిని: ఐరోపా పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటి?
గాంధీ: ఇప్పుడున్నట్లుగా యూరప్ ఎక్కువకాలం సాగలేదు. తన ఆర్థిక విధానాలను, విలువలను మార్చుకోవాలి.
ముసోలిని: ప్రాక్‌పశ్చిమాలు (ఈస్ట్-వెస్ట్) కలిసే అవకాశం ఉందా?
గాంధీ: పశ్చిమ దేశాలు తూర్పుదేశాలను దోచుకుంటున్నాయి. ఆ దోపిడీ ఆగిన తక్షణం.. పరస్పర సహకారానికి తలుపులు తెరచుకుంటాయి.
ముసోలిని: నా అభిప్రాయం కూడా అదే.
కొంతసేపు ఇటలీ గురించి మాట్లాడుకొని.. తర్వాత ముసోలిని గది బయటి దాకా వచ్చి గాంధీకి (Azadi Ka Amrit Mahotsav) వీడ్కోలు పలికారు. ఇంకా మాట్లాడాలనుకున్నా మీరాబెన్ (బ్రిటిష్ వనిత) బ్రిటన్ గూఢచారి అనే అనుమానంతో.. సమావేశాన్ని ముసోలిని ముగించారనేది దేశాయ్ అభిప్రాయం.
- గాంధీజీ భారత్‌కు తిరిగి వచ్చేసరికి.. గోలగోల! ముసోలినిని మెచ్చుకున్నట్లు.. బ్రిటన్‌ను తీవ్రంగా ఆక్షేపించినట్లు ఇటలీ పత్రికలు రాశాయి. ఓ పత్రికైతే ఏకంగా గాంధీజీ ప్రత్యేక ఇంటర్వ్యూ అంటూ ప్రచురించింది. గాంధీజీ దీన్ని తీవ్రంగా ఖండించారు. అయినా.. ముసోలినితో భేటీ కావటమే ఇష్టంలేని బ్రిటిష్ ప్రభుత్వం ఆయనపై కారాలు నూరింది. గాంధీని జనవరిలో అరెస్టు చేసి ఎరవాడ జైలుకు పంపించి, కాంగ్రెస్‌పై నిషేధం విధించింది.
- తర్వాత కొద్దిరోజులకు దేశాయ్‌తో గాంధీజీ ఈ సమావేశం గురించి ప్రస్తావించారు. "ముసోలిని కళ్లు చూశావా కాస్త తేడాగా ఉన్నాయి. ఎందుకనో ఆయన మానవత్వం ఉన్న మనిషిలా అన్పించలేదు" అంటూ వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:Azadi ka amrit mahotsav: గాంధీకి ముందే సైంటిస్ట్ సత్యాగ్రహ