Gall Bladder Stone Surgery :ఓ వృద్ధుడి పిత్తాశయం నుంచి 1,364 రాళ్లను తొలగించారు వైద్యులు. అనేక ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అతడికి.. కష్టతరమైన సర్జరీని నిర్వహించి ప్రాణాలు నిలబెట్టారు డాక్టర్లు. దాదాపు 45 గంటల పాటు శ్రమించి విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేశారు. బంగాల్లోని కోల్‌కతా మెడికల్ కాలేజ్ వైద్యులు.. ఈఅరుదైన శస్త్ర చికిత్స చేశారు.
మేదినీపుర్ జిల్లాకు చెందిన అశోక్ గుచైత్(65).. గత కొద్ది రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో స్థానికంగా ఉన్న చాలా మంది వైద్యులను సంప్రందించాడు. అయినా ఏ మాత్రం పరిష్కారం లభించలేదు. చివరగా కోల్‌కతా మెడికల్ కాలేజ్‌ను సంప్రదించాడు అశోక్. అనంతరం అతడికి అల్ట్రాసోనోగ్రఫీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. రోగి నివేదికలు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. పిత్తాశయంలో భారీ స్థాయిలో రాళ్లు ఉండటాన్ని గుర్తించారు.
ఆలస్యం చేయకుండా వెంటనే ఆ వృద్ధుడికి ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. సెప్టెంబర్ 8న ఈ శస్త్రచికిత్స జరిగింది. దాదాపు 45 గంటలపాటు శ్రమించిన వైద్యులు.. మొత్తం 1,364 రాళ్లను వృద్ధుడి పిత్తాశయం నుంచి బయటకు తీశారు. "ఇప్పటికే కిడ్నీ, డయాబెటీస్, రక్తపోటు సమస్యలతో ఆ వృద్ధుడు బాధపడుతున్నాడు. దీంతో ఆపరేషన్ నిర్వహించడం కాస్త కష్టంగా మారింది. ఒకవేళ పిత్త వాహికలోకి రాళ్లు ప్రవేశించి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేది. చివరకు ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించాం." అని డాక్టర్ ఘోష్ తెలిపారు.