వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన రెడ్డి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పేరుతో పార్టీ స్థాపించిన ఆయన.. పోటీకి దిగే అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా బళ్లారి-సిటీ నియోజకవర్గంలో తన భార్య అరుణ లక్ష్మిని పోటీకి దించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్థానానికి భాజపాలో ఉన్న జనార్దన రెడ్డి తమ్ముడు సోమశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు జనార్దన రెడ్డి.
జనార్దన రెడ్డి సోదరులైన కరుణాకర రెడ్డి, సోమశేఖర రెడ్డి ఇప్పటికీ భాజపాలోనే కొనసాగుతున్నారు. కరుణాకర రెడ్డి హరపనహళ్లి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరితో పాటు గాలి సన్నిహితుడైన కర్ణాటక మంత్రి శ్రీరాములు సైతం భాజపాను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భాజపా.. రానున్న ఎన్నికల్లో సోమశేఖర రెడ్డిని బళ్లారి నుంచే బరిలోకి దించితే కుటుంబ సభ్యుల మధ్య పోరుకు తెరతీసినట్లవుతుంది. ఈ విషయంపై విలేకరులు గాలి జనార్దనను ప్రశ్నించగా.. తాను ఏ పార్టీపైనా వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. తాము ఎవరినో ఓడించడానికి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
"నా భార్య పోటీ చేసే స్థానం గురించి నేను చేసిన ప్రకటనపై ఎవరికీ అనుమానాలు లేవనే భావిస్తున్నా. ఎక్కడ నా పార్టీ గెలుస్తుందని అనుకుంటానో, ఎక్కడైతే మాకు గెలిచే అవకాశాలు ఉంటాయో.. అక్కడ మా అభ్యర్థులను బరిలో దించుతాం. ఎవరినో ఓడించేందుకు పోటీ చేయాల్సిన అవసరం మాకు లేదు. మూడు నెలల్లో నియోజకవర్గాల్లో పర్యటిస్తా. నాకున్న అవకాశాల మేరకు మా అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తా."
-గాలి జనార్ధన రెడ్డి, కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ అధ్యక్షుడు
కుటుంబంతో గాలి జనార్దన రెడ్డి పార్టీ పెట్టిన స్వల్ప కాలానికే రాష్ట్రంలో అందరు రాజకీయ నాయకులకు నిద్రలేకుండా చేశామని చెప్పుకొచ్చారు గాలి జనార్దన రెడ్డి. 'నేను పార్టీ పెట్టి కేవలం నెల దాటింది. కానీ, రాష్ట్రంలోని అన్ని పార్టీలను, రాజకీయ నాయకులను నిద్రపోనీయకుండా చేశాం. నేను ఎవరికీ భయపడను. పార్టీ చాలా బలంగా ఉంది. వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. మీ అందరి ఆశీస్సులతో లక్ష్యాన్ని చేరుకుంటాం' అని గాలి స్పష్టం చేశారు.
ర్యాలీలో గాలి జనార్దన రెడ్డి గాలి జనార్దన రెడ్డి కుటుంబం రెండు దశాబ్దాలుగా భాజపాతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటూ గతేడాది డిసెంబర్లో కొత్త పార్టీపై ప్రకటన చేశారు గాలి జనార్దన రెడ్డి. భాజపా తనను సరిగా ఉపయోగించుకోలేదని, అగ్రనాయకత్వం తన పట్ల అనుచితంగా వ్యవహరించిందని అప్పుడు వ్యాఖ్యానించారు. అక్రమ బొగ్గు మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న గాలి.. 2015 నుంచి బెయిల్పై ఉన్నారు. బళ్లారికి వెళ్లకుండా ఆయనపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే సొంత జిల్లా నుంచి తన భార్యను పోటీకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
గాలి జనార్దన రెడ్డి కుటుంబం