Gadwala MLA Krishnamohan Reddy Election Invalidated : శాసనసభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్(BRS)కు షాక్ తగిలింది. వరుసగా ఎమ్మెల్యేల ఎన్నిక అఫిడవిట్ చెల్లదంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విషయం మరువకు ముందే.. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(Gadwala MLA Krishnamohan Reddy) ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు(Telangana High Court) తీర్పు వెలువరించింది. దీంతో రెండో స్థానంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna)ను ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అంశంలో ఈ తీర్పును వెలువరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘించినందున రూ.2.50 లక్షల జరిమానా చెల్లించడంతో పాటు.. పిటిషనర్ డీకే అరుణకు రూ.50వేల చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్ వివాదంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను కొట్టివేయగా.. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగింది :2018 అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి డీకే అరుణ పోటీ చేశారు. డీకే అరుణపై కృష్ణమోహన్ రెడ్డి 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్ లో కృష్ణమోహన్ తన ఆస్తులు, చలాన్లు, అప్పుల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని డీకే అరుణ 2019లోనే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈవీఎంలు కూడా ట్యాంపరింగ్ అయ్యాయని.. వీవీప్యాట్ లు లెక్కించాలని కోరారు. హైకోర్టులో ఎన్నిక వివాదంపై విచారణ జరుగుతుండగానే ఆమె బీజేపీలో చేరిపోయారు.
సుప్రీం కోర్టుకు వెళ్లనున్న గద్వాల ఎమ్మెల్యే : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ విషయంపై ఆయన స్పందించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. తనకు ఇంకా హైకోర్టు నోటీసులు రానందున వాదనలు వినిపంచలేక పోయాయని వివరించారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. తన వాదనను వినకుండా హైకోర్టు తీర్పును వెలువరించిందని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆవేదన చెందారు. డీకే అరుణ ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. కోర్టును ఆమె తప్పుదోవ పట్టించారన్నారు. ప్రజాకోర్టులో అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.
"హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెల్లనున్నాను. నాకు హైకోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రానందున వాదనలు వినిపించలేకపోయాను. నా వాదనలు వినకుండానే ఉన్నతన్యాయస్థానం తీర్పును ఇచ్చింది. డీకే అరుణ ఆరోపణల్లో నిజం లేదు. కోర్టును ఆమెను తప్పుదోవ పట్టించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాను. డీకే అరుణ టూరిస్టు నాయకురాలు.. తాను నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని. అంతిమంగా ప్రజాకోర్టులో ప్రజలే నిర్ణయిస్తారు."- కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే