Gadwal Politics in Telangana Assembly Elections : గద్వాల పేరు చెబితే టక్కున గుర్తొచ్చేది సంస్థానం. అప్పటి కోట. చేనేత రంగం. రాజకీయంగా గద్వాల పేరు చెప్తే గుర్తొచ్చేది మాత్రం డీకే కుటుంబం. బంగ్లా పాలన. 1957 నుంచి ఇప్పటివరకూ డీకే కుటుంబం(DK Family) పోటీ చేయని ఎన్నికల్ని అక్కడి ఓటర్లు చూడలేదు. మొదటిసారిగా డీకే కుటుంబం పోటీ చేయకుండా జరుగుతున్న శాసనసభ ఎన్నికలు ఇవే కావడం విశేషం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా జనం దృష్టి.. ప్రస్తుతం గద్వాలపై పడింది. బీసీవాదం బలపడిన నేపథ్యంలో.. వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు డీకే అరుణ ప్రకటించడం సంచలనం రేపింది.
గతంలో నన్ను బాధ పెట్టారు - ఈసారి అలా జరగొద్దు : సీఎం కేసీఆర్
Election Campaign in Gadwal :గద్వాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డినే బీఆర్ఎస్ ఎన్నికల బరిలో నిలిపింది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బీసీని.. అందునా మహిళను బరిలో దిపింది. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సరిత.. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు. గద్వాలలో బీసీ ఓటు బ్యాంకు(BC Vote Bank) ఎక్కువ. కురవ, వాల్మీకి బోయ సహా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఏళ్లకు ఏళ్లుగా డీకే సత్యారెడ్డి, పాగ పుల్లారెడ్డి కుటుంబ సభ్యులు మినహా.. మిగిలిన వారికి ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు.
1999లో గట్టుభీముడు డీకే అరుణపై విజయం సాధించి.. బంగ్లాపాలనకు అట్టుకట్ట వేశారు. కాంగ్రెస్ వ్యూహంతో ఇప్పుడు బీసీ నినాదం ఊపందుకుంది. ప్రత్యర్థులే అయినా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. డీకే అరుణ మేనల్లుడు. ఆ కుటుంబ పాలనకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ బీసీ వాదాన్ని ఓటర్లలోకి బలంగా తీసుకువెళ్తోంది. బీసీవాదం బలపడటంతో డీకే అరుణ(DK Aruna) కుటుంబం సైతం వ్యూహాత్మకంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన శివారెడ్డిని బీజేపీ అభ్యర్ధిగా బరిలో దించింది. దీంతో వాల్మీకీల ఓట్లు చీలుతాయని భావించిన కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే వాల్మీకీ బోయ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించింది.